పవిత్ర అమర్నాథ్ యాత్ర చేపట్టేందుకు వేలాది మంది భక్తులు జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. హిమగిరుల్లోని మంచు లింగాన్ని దర్శించుకునేందుకు నేటి ఉదయం రెండు మార్గాల్లో యాత్ర అధికారికంగా ప్రారంభమైంది.
అమర్నాథుడ్ని దర్శించుకునేందుకు అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్, గండెర్బల్ జిల్లా బల్తాల్ బేస్ క్యాంపుల నుంచి రెండు మార్గాల్లో మొత్తం 4,417 మంది బయలుదేరారు.
కొండపైకి చేరుకునేందుకు వాహనాలు వెళ్లే పరిస్థితులు లేవు. చాలామంది గుర్రాలపై వెళ్తున్నారు. కొందరు కాలినడకన కొండ ఎక్కుతున్నారు. నడవలేని వారి కోసం కొందరు పల్లకి వంటి వాటిలో మోసుకెళుతుంటారు. నేటి నుంచి 46 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. ఆగస్టు 15న రాఖీ పౌర్ణమితో ముగుస్తుంది. యాత్రలో ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని మంచు లింగాన్ని దర్శించుకుంటామని చెబుతున్నారు భక్తులు.
యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.
ఇదీ చూడండి: అటంకాలెదురైనా మంచులింగాన్ని దర్శించుకుంటాం