స్వాతంత్ర్య కాంక్షను మరింత రగిల్చిన జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగి నేటికి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రాంతాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అమరులకు నివాళులు అర్పించారు. పంజాబ్‌లోని జలియన్ స్మారక స్థూపం వద్ద పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటించారు.
మొదటగా ఘటనకు సంబంధించిన ఛాయాచిత్రాల ప్రదర్శనను తిలకించారు వెంకయ్య. ఈ దురాగతానికి స్మారకంగా తపాలా బిళ్ల, వంద రూపాయల నాణెలను విడుదల చేశారు.
డయ్యర్ ఉన్మాదం
1919 ఏప్రిల్ 13న వైశాఖీ పర్వదినం. సుమారు 20వేల మంది పంజాబ్ అమృత్‌సర్‌లోని జలియన్ వాలా బాగ్ తోటలో సమావేశమయ్యారు. ప్రజలను అణగదొక్కే కఠినమైన నాటి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఏకమయ్యారు.
ఇద్దరు జాతీయ నేతలు సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూల అరెస్టు, దేశ బహిష్కరణకు వ్యతిరేకంగా వారంతా గళమెత్తారు. ప్రజల చర్య వల్ల ఆగ్రహంతో కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఉన్మాదిలా ప్రవర్తించాడు. సైనికులతో వచ్చిన డయ్యర్ తోటలోకి ప్రవేశించాడు.
డయ్యర్ ఆదేశాలతో 50 మంది సైనికులు 1650 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. బయటికి రాకుండా దారులన్నీ మూసేశారు. ఈ ఘటనలో వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: 'జలియన్‌వాలా' అమరులకు ఘన నివాళులు