గుజరాత్ రాజ్యసభ ఉపఎన్నికల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో మరో భాజపా నేత జుగల్ ఠాకూర్ గెలిచారని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ ప్రకటించారు. ఈ ఫలితాలను ఎన్నికల సంఘం ధ్రువీకరించింది. కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ ఉపఎన్నికల్లో అభ్యర్థులు గెలవడానికి 50 శాతం ఓట్లు (88 ఓట్లు) సాధించాలి. అయితే జైశంకర్ 104, ఠాకూర్ 105 ఓట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులు చంద్రికా చూడాసామా, గౌరవ్ పాండ్య ఒక్కొక్కరు 70 ఓట్లు చొప్పున ఓట్లు పొంది, ఓటమి చవిచూశారు.
కార్యదర్శి... మంత్రి... ఎంపీ...
విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జైశంకర్ మోదీ 2.0 ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా నియమితులయ్యారు. అందువల్ల ఆరు నెలల్లోపు రాజ్యసభకుగానీ, లోక్సభకుగానీ తప్పకుండా ఎన్నికవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన విజయం సాధించి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన కేంద్రమంత్రులు అమిత్‌షా, స్మృతి ఇరానీ గాంధీనగర్, అమేఠీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ కారణంతో వారిద్దరూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా ఉపఎన్నికలు జరిగాయి.
ఇదీ చూడండి: బడ్జెట్-19: జలశక్తి శాఖకు రూ.28,261 కోట్లు