భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకొంది. కమల దళపతి అమిత్ షా ప్రస్తుతం హోం శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున పార్టీని సమన్వయపరిచేందుకు జేపీ నడ్డాను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక చేసింది.
ఈ మేరకు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అమిత్‌షా నేతృత్వంలో పలు ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. ప్రధాని మోదీ తనను హోంమంత్రిగా నియమించినందున... పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు అప్పగించాలని అమిత్‌షా స్వయంగా సమావేశంలో విజ్ఞప్తి చేశారని రాజ్‌నాథ్ వెల్లడించారు. ప్రస్తుతానికి నడ్డాను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు.
"అమిత్‌షా పార్టీ బాధ్యతలు కూడా కొనసాగించాలని భాజపా పార్లమెంటరీ బోర్డు కోరింది. ఆయన పదవీకాలం ముగిసే వరకూ... సంస్థాగత ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కానీ పూర్తి స్థాయి పార్టీ బాధ్యతలు ఉంటే... తనకు అప్పగించిన కొత్త బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వహించలేనని అమిత్‌షా తెలిపారు. అందువల్ల... ప్రస్తుతానికి జగత్ ప్రకాశ్ నడ్డాను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలని భాజపా పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది."
- రాజ్‌నాథ్‌సింగ్, రక్షణ మంత్రి
హిమాచల్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నడ్డా మోదీ మొదటి విడత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. భాజపా తెలంగాణ వ్యవహారాల బాధ్యతలూ నిర్వర్తించారు.
- ఇదీ చూడండి: బిహార్: 104కు చేరిన 'ఏఈఎస్' మృతులు