జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణలు 370,35-A ల రద్దు అనంతరం కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొట్టేందుకు వీలుగా నియంత్రణ రేఖ వెంట మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
జమ్మూ శ్రీనగర్‌లో విధించిన 144 సెక్షన్ కొనసాగుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ఆదేశాలిచ్చింది. లోయలోనూ బలగాలను పెంచుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి భద్రతా సిబ్బందిని కశ్మీర్‌కు తరలిస్తోంది. పారామిలటరీ బలగాలు సహా వాయుసేన, సైన్యం అప్రమత్తంగా ఉండాలని సూచించింది కేంద్రం. ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
కేంద్రం ఆదేశాలకనుగుణంగా.. జమ్మూలో అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. గత అర్ధరాత్రి నుంచే పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గృహ నిర్బంధంలో ఉంచిన మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను అరెస్టు చేశారు పోలీసులు. ఆంక్షల్ని మరింత పెంచారు. శ్రీనగర్‌లో ప్రజల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నారు. అంతర్జాల సేవల నిలిపివేత కొనసాగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాయి బలగాలు.
గవర్నర్ సమీక్ష....
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
జమ్ములో పర్యటించి శ్రీనగర్ చేరుకున్న సలహాదారులు విజయ్ కుమార్, స్కందన్, కేకే శర్మలు గవర్నర్‌కు తాజా పరిస్థితులను వివరించారు. నిత్యావసర వస్తువులు, నీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సేవల అంశాలపై గవర్నర్‌కు వివరణ ఇచ్చారు.
ఉత్తర కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్, శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్ సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. పరిస్థితులపై చర్చించారు.
అన్ని విభాగాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సత్యపాల్ మాలిక్ ఆదేశించారు. శాంతి భద్రతలను విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని ప్రజలను గవర్నర్ కోరారు. శాంతి భద్రతలను పాటించేందుకు నేతలు, సామాజిక కార్యకర్తలు సహకరించాలన్నారు.