జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం.. స్వయం పాలన దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. సమితి అభివృద్ధి మండళ్ల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 31న జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. అందుకు వారం రోజుల ముందు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 316 సమితులకు గాను 310 ప్రాంతాలకు అక్టోబర్ 24న ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు ఎన్నికల అధికారి శైలేంద్రకుమార్. అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని... నామినేషన్ల దాఖలుకు చివరి తేది అక్టోబర్ 9 అని ప్రకటించారు.
నామపత్రాల పరిశీలన అక్టోబర్ 10న చేపడతామని.. 11 వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 24న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని.. ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమౌతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నిక బ్యాలెట్ విధానంలో జరగనుంది.
ఈ ఎన్నికలను పార్టీల ఆధారంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఛైర్మన్ల స్థానానికి 26,629 వార్డ్ సభ్యులు, సర్పంచ్లు పోటీ చేస్తారని, వారికే ఓటు హక్కు ఉంటుందని వెల్లడించారు. పలు కారణాలతో 12,766 వార్డ్ సభ్యులు, సర్పంచ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
జమ్ము ప్రాంతంలో 18 వేల మంది వార్డ్ సభ్యులు, సర్పంచులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండగా.. కశ్మీర్ ప్రాంతంలో ఆ సంఖ్య 7528గా ఉంది.
310 సమితి అభివృద్ధి మండళ్లకు జరిగే ఈ ఎన్నికలో 69 స్థానాలను గిరిజనులకు (21మంది మహిళలకు), 25 సీట్లు ఎస్సీలకు (7 మహిళలకు), 78 స్థానాలు జనరల్ కేటరిగిలో మహిళలకు రిజర్వు చేశారు.
ఇదీ చూడండి: మైసూరులో మొదలైన దసరా మహోత్సవాలు