జమ్ము కశ్మీర్ తాజా పరిస్థితిపై ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం వివరాలు అందించారు. వచ్చేవారం నుంచి కశ్మీర్ లోయలో పాఠశాలలు, దుకాణాలు తెరుచుకునేలా చర్యలు తీసుకుంటున్నామని జమ్ముకశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా పనిచేస్తున్నాయన్నారు. ఉగ్రదాడులకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంపైనే తమ దృష్టి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నేటి నుంచి విధులకు హాజరు కావాలని రేడియో ద్వారా ఆదేశాలను జారీ చేసినట్లు వెల్లడించారు సుబ్రహ్మణ్యం. దశలవారిగా టెలిఫోన్ వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు.
22 జిల్లాల్లో 12 జిల్లాలు సాధారణంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని.. ఐదు జిల్లాల్లో స్వల్పంగా ఆంక్షలు ఉన్నట్లు తెలిపారు సుబ్రహ్మణ్యం. ఆంక్షలు కొనసాగిన పన్నెండు రోజులు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.
లోయలో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, కింది స్థాయిలో పరిస్థితులను బట్టి భద్రతా దళాల ఉపసంహరణ ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్'సంబంధిత పిటిషన్లపై సుప్రీం విచారణ వాయిదా