జమ్ముకశ్మీర్‌లోని కథువా, పుంఛ్ జిల్లాల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. వివిధ సెక్టారుల్లో గ్రామాలే లక్ష్యంగా మోర్టార్ షెల్స్‌తో దాడులకు తెగబడింది.
పాక్ చర్యకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం.. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని తెలిపింది. కథువా జిల్లా హీరానగర్ సెక్టార్‌లోని మనీహారి, చంద్వా, లోండి గ్రామాల్లో శివాలయం సహా కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.
కొన్నిపశువులకు బుల్లెట్ గాయాలవగా.. వాటికి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి 9.45 గంటల నుంచి.. ఉదయం 5.25 వరకు పాక్ బలగాలు దాడులు కొనసాగించినట్లు అధికారులు చెప్పారు.
పుంఛ్ జిల్లాలోనూ కస్బా, కిడని, షాపూర్ సెక్టార్లలో పాక్ సైన్యం మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించిందని వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యమా? వారసత్వ రాజకీయాలా?'