భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. బాధితురాలు వుహాన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ యువతి. అప్పటికి కొన్ని రోజుల ముందే ఆమె వుహాన్ నుంచి కేరళకు తిరిగొచ్చింది. వైరస్‌తో పోరాడి జయించిన ఆమె.. ఇప్పుడు తిరిగి వుహాన్‌కు వెళ్లడానికి ఎదురుచూస్తోంది.
భయపడలేదు...
వుహాన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 20ఏళ్ల ఆమె.. సెమిస్టర్ సెలవుల కోసం జనవరి నెలలో కేరళకు వచ్చింది. వైరస్ లక్షణాలతో అదే నెల 27న ఆసుపత్రిలో చేరింది. 30న ఆమెకు వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఫలితంగా భారత్‌లో తొలి కరోనా కేసు నమోదైంది.
దాదాపు మూడు వారాల చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కొలుకుంది. రెండు సార్లు వైరస్ నెగిటివ్‌గా తేలిన అనంతరం ఫిబ్రవరి 20న డిశ్ఛార్జ్ అయ్యింది. తనకు వైరస్ సోకినట్టు తెలిసినప్పుడు అసలు భయపడలేదని పేర్కొంది బాధితురాలు.
"నాకు వైరస్ సోకిన సమయానికే.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైరస్ బారిన పడ్డారు. వారిలో చాలా మంది కోలుకున్నారు. అందుకే నేను భయపడలేదు. చైనా నుంచి వస్తున్నప్పుడు.. అధికారులను సంప్రదించమని అక్కడి భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించు కోవాలని తెలిపింది."
- దేశంలోని తొలి వైరస్ బాధితురాలు
అప్పటి నుంచి ఆమె కేరళ ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూనే ఉంది. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది.
'వుహాన్‌కు తిరిగి వెళ్లాలని ఉంది...'
ప్రస్తుతం ఇంట్లో ఉంటూనే.. వుహాన్‌లోని తన వర్సిటీ నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతుల ద్వారా విద్యను అభ్యసిస్తోంది బాధితురాలు. వుహాన్‌కు వెళ్లడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు స్పష్టం చేసింది.
"వుహాన్‌కు తిరిగి వెళ్లాలని ఉంది. ప్రస్తుతానికి వర్సటీ ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నా. నాకు వంట చేయడం ఎంతో ఇష్టం. వుహాన్‌లోని నా హాస్టల్లో వంట గది ఉండేది. అక్కడ నా వంట నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడు మా అమ్మకు వంటలో సహాయం చేస్తున్నా. సమోసాలు, కట్లెట్లు చేస్తున్నా."
-- దేశంలోని తొలి వైరస్ బాధితురాలు.
బుధవారం నాటికి కేరళవ్యాప్తంగా 485 కరోనా కేసులు నమోదయయ్యాయి. ఇందులో 123 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ విజృంభించిన తొలినాళ్లల్లో భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయినా.. వైరస్‌ను నియంత్రించడంలో కేరళ ప్రభుత్వం విజయం సాధించింది.