కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్... ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ముందు జాగ్రత్తగా కరోనా అనుమానితులకు ప్రథమ చికిత్స అందించడానికి దిల్లీలో 600 పడకలతో ప్రత్యేక శిబిరాన్ని... సరిహద్దు భద్రత దళమైన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
600 పడకలతో..
నైరుతి దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో ఐటీబీపీ ప్రధాన కార్యాలయం వద్ద 15 మంది సఫ్దర్జంగ్ ఆసుపత్రికి చెందిన వైద్యులు, 10మంది ఐటీబీపీ సిబ్బందితో మొత్తం 25మంది వైద్యుల బృందం ఈ శిబిరంలో పనిచేయనున్నట్లు ఆ దళానికి చెందిన ఉన్నతాధికారి వివేక్ పాండే తెలిపారు. 600 పడకలతో ఈ శిబిరాన్ని నెలకొల్పినట్లు స్పష్టం చేశారు.
''ఈ శిబిరాన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశాం. ఇందులో పిల్లలు, మహిళలకు ప్రత్యేక వార్డులు కేటాయించాం. చైనా నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలో స్కీనింగ్ టెస్టు నిర్వహించి, తరువాత బాధితులను ఈ శిబిరానికి తీసుకొస్తారు.''
-వివేక్ కుమార్ పాండే
ఐటీబీపీ పంథాలోనే సైన్యం
చైనాలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక విమానాన్ని పంపించింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చైనాలోని హుబే రాష్ట్రం నుంచి రాబోతున్న 300మంది విద్యార్థుల కోసం దేశ రాజధానికి సమీపంలోని మానేసర్ వద్ద భారత సైన్యం వైద్య శిబిరాన్నిఏర్పాటు చేసింది. విద్యార్థులు ఇక్కడ రెండు వారాల పాటు వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంటారని సైన్యాధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి: బ్రిటన్కు కరోనా భూతం- రెండు కేసులు నిర్ధరణ