వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట చైనా సైనికుల చొరబాటు నిజమేనని, వారు ఇంకా అక్కడే కొనసాగుతున్నారని లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎల్‌ఏహెచ్‌డీసీ)కు చెందిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ కోన్‌చోక్ స్టాన్‌జిన్ తెలిపారు. శీతాకాలంలోపు చైనా సైనికులు అక్కడి నుంచి వెనుదిరగక పోతే తమ పశుసంపదకు ఆహార సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'ఈటీవీ భారత్'తో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
జీవనోపాధి
ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాలు తమ సైనికులను మోహరించాయి. ఎల్‌ఏసీ వద్దనున్న బఫర్ జోన్ పరిధిలోని ఏడు గ్రామాల్లో 1,100 మంది నివసిస్తున్నారని స్టాన్‌జిన్ వెల్లడించారు. పశువులు, ప్రత్యేకించి పష్మినా రకం మేకలు వారి జీవనోపాధికి ప్రధాన ఆధారం. శీతాకాలం వస్తే పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయలోని పచ్చిక బయళ్లలో వాటిని మేపుతుంటారని, 15 రోజులు మాత్రమే అందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సైనికుల గస్తీ, తనిఖీలు గంటపాటు కొనసాగటం తమకు సాధారణమేనని, అయితే, గత నెల రోజులుగా ఇవి నిరంతరంగా కొనసాగటం స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వాస్తవాధీన రేఖ వెంట సరిహద్దులపై స్పష్టతలేకపోవటం, చైనా సైన్యం ఆక్రమణ యత్నాలు తమకు ప్రధాన సమస్యగా మారాయన్నారు. ఒక్కోసారి చైనా సైనికులు పశువుల కాపర్ల అవతారంలో తమ ప్రాంతానికి వచ్చి తిష్ట వేస్తుంటారని, అదంతా తమ భూభాగమేనని వాదిస్తుంటారని తెలిపారు. భారత సైనికులు కూడా తమను ఆ ప్రాంతాలకు స్వేచ్ఛగా వెళ్లనివ్వాలని తద్వారా చైనా సైనికుల కదలికలపై సమాచారం ఇవ్వగలమని కోన్‌చోక్ అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారానే రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోవటం మంచిదని తెలిపారు.
ఇదీ చూడండి: సంప్రదింపులతోనే సమస్యను పరిష్కరించుకొందాం