రోదసి వాణిజ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జోరు పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రయత్నాలు చేపడుతున్న వేళ- ఇస్రో వడివడిగా అడుగులు వేస్తోంది. తన తురుఫు ముక్క పీఎస్‌ఎల్‌వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్ 50వ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. అన్నీ సజావుగా జరిగితే ఈ నెల 11న పీఎస్‌ఎల్‌వీ-సీ48 రాకెట్ దేశీయ నిఘా నేత్రమైన ‘రిశాట్-2 బీఆర్-1’ తోపాటు మరో తొమ్మిది చిన్న ఉపగ్రహాలను తీసుకొని నింగికి ఎగయనుంది. ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ తరవాత వచ్చిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ఇస్రోను వాణిజ్య పరంగా ఉన్నత శిఖరాలకు చేర్చింది.
ఇటీవల ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ 47 ప్రయోగం ఎంతో ప్రత్యేకమైంది. దీనిలోని కార్టోశాట్ చాలా అమెరికా ఉపగ్రహాల కంటే స్పష్టమైన చిత్రాలను అందించగలదు. ఈ ప్రయోగంతో ఇస్రో అంతరిక్షంలోకి చేర్చిన విదేశీ రాకెట్ల సంఖ్య 300 మైలురాయిని దాటింది. అమెరికా, జర్మనీ, బ్రిటన్ వంటి 33 దేశాలు ఇస్రో ఖాతాదారులే. చిన్న ఉపగ్రహాల రవాణాలో ఇస్రో సత్తా చాటుకొంది. ఈ ఉపగ్రహాలన్నీ పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల నుంచి ప్రయోగించినవి కావడం విశేషం. ’
పదేళ్లలో 8,600 ఉపగ్రహ ప్రయోగాలు..
ఇప్పటివరకు ఇస్రో చేసే వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలకు సంబంధించిన వ్యాపారాన్ని ‘యాంత్రిక్స్’ అనే వాణిజ్య విభాగం చూసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో రాకెట్ సామర్థ్యాన్ని మించి ఆర్డర్లు వస్తుండటంతో వాటిని వదులుకోవాల్సి వస్తోంది. చిన్న ఉపగ్రహాల ప్రయోగ విపణి విలువ 2009-2018 మధ్య 12.6 బిలియన్ డాలర్ల (రూ.89.75 వేల కోట్ల) నుంచి 42.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.04 లక్షల కోట్ల)కు పెరిగింది. ఇది 2019-2028 నాటికి నాలుగింతలు అవుతుందని అంచనా. వచ్చే పదేళ్లలో 8,600 ఉపగ్రహ ప్రయోగాలు జరగనున్నాయి. దీంతో చిన్న ఉపగ్రహాల ప్రయోగ విపణికి రానున్న రోజుల్లో భారీగా గిరాకీ ఉంటుంది. అందుకు తగ్గట్లు భారత్‌లోనూ అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలు అడుగుపెట్టాల్సి ఉంది.
ఇప్పటికే అమెరికాలో స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి సంస్థలు మానవ సహిత అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతున్నాయి. దీంతో భారత్‌లో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే ఈ ఏడాది మార్చిలో అదనంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ పేరుతో మరో వాణిజ్య విభాగాన్ని బెంగళూరులో ప్రారంభించారు. భారత్‌లోని ప్రైవేటు సంస్థలను అంతరిక్ష రంగంలోకి వచ్చేలా సాయం చేయడం, ఇస్రో పరిశోధనల ఫలాలను దేశంలోని పారిశ్రామిక రంగానికి చేర్చడం దీని ప్రాథమిక లక్ష్యాలు. ఈ ఏడాదే ‘లిథియం అయాన్ బ్యాటరీ’ సాంకేతికతను సంస్థలకు అత్యంత చవగ్గా విక్రయానికి సిద్ధంగా ఉంచింది.
త్వరలోనే ఎస్‌ఎస్‌ఎల్‌వీ..
మరోవైపు పీఎస్‌ఎల్‌వీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ని యుద్ధప్రాతిపదికన భారత్ అభివృద్ధి చేస్తోంది. దీని సామర్థ్యం 300-500 కిలోల మధ్య ఉండవచ్చని అంచనా. దీన్ని త్వరలోనే ప్రయోగిస్తామని కార్టొశాట్ ప్రయోగం సందర్భంగా ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. చిన్న రాకెట్‌గా వ్యవహరించే దీని ప్రయోగం విజయవంతమై అందుబాటులోకి వస్తే ఇస్రో ఖర్చు గణనీయంగా తగ్గడంతోపాటు, మరింత చవగ్గా ఉపగ్రహాలను ప్రయోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాణిజ్య అవసరాల దృష్ట్యా దీన్ని ప్రయోగించడం అత్యంత సులువుగా ఉండేలా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంటోంది.
పీఎస్‌ఎల్‌వీని ప్రయోగానికి సిద్ధం చేయడానికి ప్రాజెక్టును బట్టి రెండు నెలల వరకు సమయం పడుతుంది. దీనికి ఏర్పాట్లు భారీగానే ఉంటాయి. అదే ఎస్‌ఎస్‌ఎల్‌వీకి ఇందులో నాలుగోవంతు కంటే తక్కువ సమయం సరిపోతుంది. ఖర్చు పరంగా చూసుకొన్నా పీఎస్‌ఎల్‌వీ కంటే చాలా తక్కువ. రూ.30 కోట్లతో ప్రయోగం పూర్తి చేయవచ్ఛు పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి కనీసం 600 మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి పదిమంది లోపు బృందం చాలు. యాంత్రిక్స్ అంచనా ప్రకారం వచ్చే పదేళ్లలో ఏటా 60 వరకు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉంది.
ఆదాయంతో పాటు పరపతి
వాణిజ్యపరంగా ఉపగ్రహాలను ప్రయోగించడం వల్ల దేశానికి ఆదాయంతోపాటు విదేశాల్లో భారత్ పరపతి పెరుగుతుంది. సాధారణంగా కమ్యూనికేషన్లు, ఇంధన అవసరాలు తీర్చే దేశాలతో ఎవరూ విరోధం పెట్టుకోవడానికి ఇష్టపడరు. భారత్‌కు పొరుగున ఉన్న దేశాలకు చిన్న ఉపగ్రహాల ప్రయోగం చాలా అవసరం ఉంది. ఇస్రో కొత్త రాకెట్‌తో పొరుగుదేశాల అవసరాలు చవగ్గా తీరిస్తే అక్కడ భారత్ పలుకుబడి పెరుగుతుంది. భారత్ ‘సార్క్’ దేశాలకు మెరుగైన కమ్యూనికేషన్ల కోసం ‘జీశాట్’ను ప్రయోగించింది. దీనికి సంబంధించి అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంకకు విశేష సేవలు అందనున్నాయి.
విపణిలో ప్రైవేటు సంస్థలు..
ఉపగ్రహ ప్రయోగ విపణిలో పలు దేశాలకు చెందిన ప్రైవేటు సంస్థలు అడుగుపెట్టాయి. ప్రస్తుతం అంతరిక్షంలోకి కిలో బరువైన ఉపగ్రహాన్ని భూమి దిగువ కక్ష్యకు చేర్చడానికి సుమారు 20 వేల డాలర్లు (సుమారు రూ.14.25 లక్షలు) ఖర్చవుతున్నాయి. ఇంతకంటే తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయగలిగితేనే కాంట్రాక్టులు దక్కుతాయి. పీటర్‌బెక్ నేతృత్వంలోని రాకెట్ ల్యాబ్స్ అనే అమెరికా సంస్థ ఎలక్ట్రాన్ పేరుతో అతి చిన్న రాకెట్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే స్పేస్ ఎక్స్ నుంచి ఈ సంస్థ కొన్ని పనులను ఒప్పంద ప్రాతిపదికన తీసుకుని ఆరు ఉపగ్రహాలను న్యూజిలాండ్‌లోని ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి చేర్చింది. 150 కిలోల బరువున్న ఉపగ్రహాలను నింగిలోని కక్ష్యలోకి చేర్చడానికి 60 లక్షల డాలర్లు (సుమారు రూ.42.75 కోట్లు) ఖర్చయింది. మరోపక్క స్పేస్‌ఎక్స్ పునర్వినియోగ రాకెట్ల పరీక్ష దశకు చేరింది. భారత్ దీనికి సంబంధించిన పరీక్ష 2016లో చేసింది.
చైనాకు చెందిన స్టార్టప్ లింక్ స్పేస్... ఆర్‌ఎల్‌వీ టీ5 రాకెట్‌ను పునర్వినియోగించేలా మార్చే ప్రయత్నాల్లో పురోగతి సాధించింది. చైనాకు చెందిన ఐ స్పేస్ 2021లో తొలిపరీక్ష చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇది విజయవంతమైతే 70శాతం ఖర్చు తగ్గిస్తామని ఐ స్పేస్ చెప్పడం విశేషం. ఈ సాంకేతికతను ఇస్రో ఒడిసి పట్టుకోగలిగితే రోదసి రంగాన భారత్ భవితకు ఢోకా ఉండదు!