చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్‌పై ఆశలు వదులుకోలేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో స్పష్టం చేసింది. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని స్పష్టం చేసింది.
మూడు వారాల క్రితం 'విక్రమ్' చంద్రుని ఉపరితలాన్ని బలంగా ఢీకొంది. దానిలోనే రోవర్ ప్రజ్ఞాన్ కూడా ఉండిపోయింది. ఏడు గ్రౌండ్ స్టేషన్లకు విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో... కమ్యునికేషన్ పునరుద్ధరణ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అయితే 10 రోజుల క్రితం ఈ ప్రక్రియను నిలిపేశారు.
"ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఇప్పుడు సాధ్యం కాదు. ప్రస్తుతం అక్కడ రాత్రి సమయం. చంద్రునిపై పగలు వచ్చే సమయంలో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తాం. విక్రమ్ ల్యాండ్ అయిన చోట రాత్రి సమయం కావడం వల్ల, దానికి పవర్ ఉండకపోవచ్చు."
-శివన్, ఇస్రో ఛైర్మన్
చంద్రయాన్-2
చంద్రయాన్-2ను ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఇందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉంటాయి. ఇప్పటి వరకు ఏ దేశమూ చేరుకోలేని చంద్రుని దక్షిణ ధ్రువంలో పరిశోధనలు చేయడానికి దీనిని రూపొందించారు. ల్యాండర్, రోవర్ మిషన్ జీవితకాలం ఒక చంద్రదినం. ఇది భూమిపై 14 రోజులకు సమానం అని ఇస్రో ప్రయోగానికి ముందే స్పష్టం చేసింది.
ప్రయత్నించడంలో తప్పులేదు
ప్రస్తుత పరిస్థితుల్లో విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరణ అంత సులభంకాదని కొంత మంది అంతరిక్ష రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రుని బలంగా ఢీకొన్నందున అందులోని పరికరాలు దెబ్బ తినే అవకాశం కూడా ఉందని వారు అంటున్నారు.
"చాలా రోజులు గడిచినందున విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించడం అంత సులభంకాదు. అయితే ప్రయత్నించడంలో తప్పేమీ లేదు."
- ఓ ఇస్రో అధికారి
ఇదీ చూడండి: పీఎంసీ బ్యాంక్ సంక్షోభంతో మార్కెట్లకు భారీ నష్టాలు