ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సీబీఐ కస్టడీని దిగువ కోర్టు మరోరోజు పొడిగించింది. నేటితో 3 రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో చిదంబరంను దిల్లీ కోర్టు ముందు హాజరు పరిచారు సీబీఐ అధికారులు.
చిదంబరం అరెస్టును సవాలు చేస్తూ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్. ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
"పౌరులందరినీ సమానంగా చూడాలి. వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ వర్తించాలి. ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏముంది? నిర్బంధ విచారణను మరో రోజు పొడిగించాలి."
- తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్
ఈ కేసు ప్రత్యేకమైనందునే మెహతా వాదిస్తున్నారని చిదంబరం తరఫు మరో న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సమాధానమిచ్చారు. ఈ కేసులో చిదంబరానికి ఉపశమనం కల్పించేందుకు సీబీఐ అంగీకరించలేదు. విచారణ నిమిత్తం కస్టడీ పొడిగించాలని కోరింది. ఈ మేరకు మరో రోజు కస్టడీకి అనుమతిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్‌కుమార్ కుహర్ తీర్పునిచ్చారు.
అంతకుముందు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని సీబీఐ కోర్టుకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
ఇదీ చూడండి: ఎయిర్‌సెల్ కేసులో చిదంబరం కస్టడీకి సీబీఐ, ఈడీ విజ్ఞప్తి