ఏలికలు ఏ పక్షం వారన్నదానితో నిమిత్తం లేకుండా పాక్ పాలక శ్రేణులంతా ముక్తకంఠంతో ఘోషించే అసుర వేదం- ఉగ్రవాదం. భారత్‌ను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా ఉగ్రవాద మిన్నాగులకు పాలుపోసి పెంచుతున్న పాకిస్థాన్ తానుసైతం వాటి కాటుకు గురవుతున్నా- పంథా మార్చుకోక పోవడమే ఉపఖండానికి పెనుశాపం! ఉగ్రవాద తండాలకు నిధుల ప్రవాహాల్ని నిలువరించాలంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) పాకిస్థాన్‌కు నిరుడు ఎకాయెకి 27 అంశాల కార్యాచరణ ప్రణాళికను అందించింది. దానికి ఇస్లామాబాద్ కట్టుబాటు గురికి బారెడు దూరంగా ఉందంటూ కార్యాచరణ ప్రణాళికను బేఖాతరు చేసిన పాకిస్థాన్‌ను ‘బ్లాక్‌లిస్ట్’లో పెట్టాల్సిందేనని ఎఫ్‌ఏటీఎఫ్ ప్రాంతీయ అనుబంధ సంస్థ ఆసియా పసిఫిక్ బృందం మొన్న ఆగస్టులోనే గట్టిగా సూచించింది. కట్టు తప్పిన పాక్‌ను నిశిత పరిశీలన అవసరమైన ‘గ్రే’ జాబితాలో చేర్చి నిర్దిష్ట కాలావధుల్లోగా ఏయే లక్ష్యాలు చేరుకోవాలో ఎఫ్‌ఏటీఎఫ్ విస్పష్టంగా నిర్దేశించినా, ఇస్లామాబాద్ 22 అంశాల్లో తీరైన చర్యలే తీసుకోలేదని తేటతెల్లమైంది. ఇరాన్, ఉత్తర కొరియాల మాదిరిగా పాకిస్థాన్‌ను ‘బ్లాక్‌లిస్ట్’లో పెట్టక తప్పని పరిస్థితి కళ్లకు కడుతున్నా ఎఫ్‌ఏటీఎఫ్ ఉదారంగా మరో నాలుగు నెలలు గడువు అనుగ్రహించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఎఫ్‌ఏటీఎఫ్ నిర్దేశిత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శీఘ్రగతిన మరిన్ని చర్యలతో కార్యాచరణ ప్రణాళిక అమలుకు పాకిస్తాన్ కూడిరాని పక్షంలో దాన్ని ‘బ్లాక్ లిస్ట్’లో పెట్టక తప్పదని టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడు జియాంగ్ మిన్ లీ గట్టిగా హెచ్చరిస్తున్నారు. 37మంది సభ్యులు, మరో రెండు ప్రాంతీయ సంస్థల సమాహారమైన ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షత మొన్న జూన్‌లోనే చైనాకు దఖలు పడింది. ఎఫ్‌ఏటీఎఫ్ నిర్ణయాన్ని ఏవైనా మూడు దేశాలు కాదంటే దానిపై టాస్క్‌ఫోర్స్ వెనక్కు తగ్గాల్సి ఉంటుంది. చైనా, టర్కీ, మలేసియాల మద్దతుతో తాత్కాలికంగా గండం గడిచి గట్టెక్కగలిగిన ఇస్లామాబాద్ వచ్చే నాలుగు నెలల్లో ఉగ్రనిధుల నిరోధానికి ఏం చెయ్యనుందో చూడాలి!
'మనీ లాండరింగ్' నిరోధించే లక్ష్యంతో..
మూడు దశాబ్దాల నాడు పారిస్‌లో జరిగిన జి-7 దేశాల శిఖరాగ్ర సదస్సు- అక్రమ నిధుల ప్రవాహాలు బ్యాంకింగ్ వ్యవస్థలకు, దేశాల ఆర్థిక సుస్థిరతకు తీవ్రాఘాతమవుతున్న వాస్తవాన్ని గుర్తించి ‘మనీ లాండరింగ్’ను నిరోధించే లక్ష్యంతో ఎఫ్‌ఏటీఎఫ్‌కు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. 1990లోనే తొలి విడత సూచనలతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ ఎప్పటికప్పుడు స్వీయ కార్యాచరణ వ్యూహానికి సాన పట్టుకొంటూ వస్తోంది. ఆర్థిక వనరులందకుండా ఎండగడితే ఉగ్రవాదాన్ని నిర్జించగలమన్న లక్ష్యంతో- ఆ అంశాన్నీ 2001లో ఎఫ్‌ఏటీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఉగ్ర నిధులకు సంబంధించి ప్రత్యేకంగా కూర్చిన తొమ్మిది సూచనలూ మనీ లాండరింగ్ సిఫార్సులకు జతబడి- అన్ని దేశాలూ ఔదల దాల్చాల్సిన అంతర్జాతీయ ప్రమాణాలుగా రూపొందాయి. వాటి అనుసారమే మొట్టమొదటిసారిగా 2012-2015 మధ్య పాకిస్థాన్ ఎఫ్‌ఏటీఎఫ్ ‘గ్రే’ జాబితాలో కొనసాగింది. మళ్ళీ నిరుడు జూన్ చివరి వారంనుంచి అదే జాబితాకు ఎక్కి, నిర్దిష్ట అంశాల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన దశలో పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజం కళ్లకు గంతలు కట్టే కుటిల పోకడలతో ఎన్నో పిల్లి మొగ్గలేసింది. మొన్న ఫిబ్రవరిలో జమాతుద్ దవా ఉగ్ర సంస్థను నిషేధించి, ఉగ్ర సంస్థల నిధుల ప్రవాహాల కట్టడిపైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు గొప్పగా సెలవిచ్చిన పాక్ చర్యల్లోని చిత్తశుద్ధి ఏపాటిదో కొద్ది నెలల్లోనే లోకానికి వెల్లడైంది. మిలిటెంట్ సంస్థల్ని నియంత్రించి, నిరాయుధీకరిస్తున్న పాక్ తొలి సర్కారు తనదేనని మొన్న జులైలో చాటుకొన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్- ఇప్పటికీ 30-40 వేలమంది ఉగ్రవాదులు తమ గడ్డమీద ఉన్నట్లు స్వయంగా వెల్లడించారు. జగమెరిగిన ఉగ్రవాది మసూద్ అజర్ ‘పింఛను’కోసం అర్జీలు పెట్టిన ‘ఘనత’నూ తన ఖాతాలోనే వేసుకొంది ఇమ్రాన్ సర్కారు!
స్వయం కృతాపరారాధాలతో..
ఇటీవలి ఎఫ్‌ఏటీఎఫ్ సదస్సు తన సూచనలకు కట్టుబాటు ప్రాతిపదికన శ్రీలంక, టునీసియా, ఇథియోపియాలను ‘గ్రే’ జాబితానుంచి తొలగించి ఐస్‌ల్యాండ్, మంగోలియా, జింబాబ్వేలను కొత్తగా చేర్చింది. ఇండియా మెడలు వంచడమే ఏకైక అజెండాగా మూడు దశాబ్దాలకుపైగా ప్రచ్ఛన్న యుద్ధంలో మునిగి తేలుతున్న పాకిస్థాన్ ఉగ్రమూకలకు ఊతమిస్తూ దేశార్థికాన్ని దివాలా అంచులకు చేర్చుకొంది. ఉగ్రవాదాన్నే స్వీయ విదేశాంగ విధానంగా మార్చుకొన్న స్వయంకృతాపరాధాలకు పాక్ చెల్లిస్తున్న మూల్యం- దాదాపు పాతిక శాతం ప్రజలు దుర్భర పేదరికంలో విలవిల్లాడటం! 40 లక్షల కోట్ల రూపాయల రుణాలు, మూడు లక్షల 40వేల కోట్ల రూపాయల విత్తలోటు, ఏడాదికాలంలో 3300 కోట్ల డాలర్లు తెగ్గోసుకుపోయిన స్థూల దేశీయోత్పత్తి, పర్యవసానంగా ఎనిమిది శాతం కుంగిన తలసరి జీడీపీ, ఒక్కశాతం కూడా లేని వ్యవసాయ వృద్ధిరేటు, 13-15శాతం మధ్య ద్రవ్యోల్బణం పోటు- పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు నిదర్శనం! తాత్కాలిక ఉపశమనం అనుకొంటున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అందించే 600 కోట్ల డాలర్ల అప్పు సైతం వరమో, శాపమో తెలియని దుస్థితిలో ఉన్న పాకిస్థాన్- మునుముందు ఎఫ్‌ఏటీఎఫ్ నిర్దేశాలను అందుకోలేక ‘బ్లాక్ లిస్ట్’లోకి జారిపోతే దాని దురవస్థలు చెప్పనలవి కాదు. అప్పులు పుట్టక, ఏ విధమైన ఆర్థిక సాయమూ అందక అలమటించే దుస్థితి రాకూడదనుకొంటే, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చెయ్యడంలో పాక్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోక తప్పదు. యథాపూర్వం ప్రపంచం కళ్లకు గంతలు కట్టాలనుకొంటే టెర్రరిస్థాన్ పరిస్థితి- పెనంమీద నుంచి పొయ్యిలోపడటం ఖాయం!