అయోధ్యలో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందన్న సమాచారంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయోధ్య అంతటా దాడులు చేయాలని పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్ పిలుపునిచ్చినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.
అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నాలుగు నెలల్లోనే రామ మందిరాన్ని నిర్మిస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థల నుంచి హెచ్చరికలు వచ్చాయి. భారత్‌లో దాడులు చేయాలని సామాజిక మాధ్యమం టెలిగ్రామ్ ద్వారా ఉగ్రవాదులను అజార్ కోరిన ఓ వీడియో ఇటీవల బయటకొచ్చింది.
ఏడుగురు ఎక్కడ?
గత నెలలో భారత్- నేపాల్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్‌కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినట్లు సమాచారం అందినప్పటి నుంచి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్, అయోధ్య నగరాల్లో తీవ్రవాదులు తల దాచుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: 'రెండేళ్ల క్రితం నా భర్తను హత్య చేశాను.. శిక్షించండి'