నీరు... భూమిపై ఉండే ప్రతి ప్రాణి మనుగడకు ఓ ఆధారం. భూమి మీద నాలుగింట మూడొంతుల నీరు ఉంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నీటి కొరతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నీటిని మనిషి దుర్వినియోగం చేయడం, ఇంతటి విలువైన నీటి సంరక్షణపై అశ్రద్ధ చూపించడం. కానీ హరియాణా పాల్వాల్ జిల్లాలోని ఓ గ్రామం అందరికీ భిన్నంగా వ్యవహరిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచే ప్రశంసలు అందుకుంది. నీటి కొరత ఎప్పటికీ తమ దరి చేరకుండా ఓ వినూత్న పద్ధతిని అవలంబిస్తోంది. ఇందుకు ఆ గ్రామం ఎంచుకున్నది "వర్షపు నీరు".
నీటి సంక్షోభం నుంచి...
భిదుకి గ్రామంలో ఒక్కప్పుడు తీవ్ర నీటి కొరత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రామ ప్రజలు.. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టుకుంటున్నారు. ఇందుకు కారణం ఆ గ్రామ సర్పంచ్ సత్యదేవ్ గౌతమ్.
సత్యదేవ్ గౌతమ్ బీటెక్, ఎంబీఏలో పట్టా పొందారు. గ్రామానికి సేవ చేయాలని.. అక్కడి పరిస్థితులు మార్చాలని చిన్నప్పటి నుంచి ఆయన కలలు కనేవారు. ఇందుకోసం లక్షల రూపాయల జీతం ఉన్న ఉద్యోగాన్ని విడిచి 2016లో సర్పంచ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన రాకతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి.
గ్రామంలో ఒకప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉండేది. ముఖ్యంగా గ్రామంలో ఉన్న బాలికల ప్రభుత్వ పాఠశాల వద్ద పరిస్థితులు అధ్వానంగా ఉండేవి. కొంచెం వర్షం పడినా నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి.
ఈ సమస్యపై ప్రత్యేక దృష్టిపెట్టిన సత్యదేవ్.. పాఠశాలలోని ఓ ప్రాంతంలో వాన నీటిని ఒడిసిపట్టుకునేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్కూలుకు సమీపంలోని భూభాగంలో మూడు ట్యాంకులను నిర్మించారు. భవనం పైన పడే వర్షపు నీరు, రోడ్డుపై నిలిచిపోయే నీటిని సేకరించేందుకు ట్యాంకులకు పైపులను అనుసంధానం చేశారు.
ఈ మూడు ట్యాంకులు ఒకదానికి ఒకటి జోడించి ఉంటాయి. వ్యర్థాలను తొలగించడానికి మొదటి రెండు ట్యాంకులను ఉపయోగిస్తారు. మూడో ట్యాంకులో 120మీటర్ల బోరుబావిని తవ్వారు. ఈ బోరుబావితో వాన నీరు భూమిలోపలకి వెళ్లిపోతుంది.
గ్రామప్రజల్లో ఆనందం..
సత్యదేవ్ ఆలోచనలతో గ్రామంలో ప్రజల కష్టాలను తొలగిపోయాయి. దాదాపు 40ఇళ్లు లబ్ధిపొందుతున్నాయి. దీనితో పాటు ఒక్కప్పుడు నీరు నిలిచిపోవడం వల్ల దారుణంగా మారిన రోడ్లు ఇప్పడు కళకళలాడుతున్నాయి.
వాన నీటిని సంరక్షించడానికి చేపట్టిన చర్యలతో భిదుకి గ్రామంపై పాల్వాల్ జిల్లా మెజిస్ట్రేట్ జితేంద్ర కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇతర గ్రామ సర్పంచ్లు కూడా ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
భిదుకి గ్రామంలో చేపట్టిన చర్యలను దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తే ఎక్కడా నీటి కొరత ఉండదు. నీరు ఉంటేనే కదా మనిషికి రేపు అనే రోజుంటూ ఉండేది!