అయోధ్యను అద్భుత పర్యటక ప్రదేశంగా మార్చడానికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి రూ.500 కోట్లు, నగరంలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాల నిమిత్తం రూ.85 కోట్లు ఖర్చుచేయనుంది. తులసీ స్మారక భవన పునరుద్ధరణకు రూ.10 కోట్లు కేటాయించింది.
ప్రధానమంత్రి నియోజకవర్గం అయిన వారణాసిలో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రూ.180 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాశీ విశ్వనాథ్ ఆలయ సుందరీకరణ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.
కాశీ హిందూ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో 'వేదిక్ విజ్ఞాన్ కేంద్ర' ఏర్పాటుకు ఆమోదం తెలిపిన యోగి సర్కార్... దీనికోసం రూ.18కోట్లు కేటాయించింది.
కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు రాయితీ ఇవ్వడానికి రూ.8 కోట్లను కేటాయించింది. ఉత్తర్‌ప్రదేశ్ పర్యటక విధానం-2018 కింద పర్యటక యూనిట్లకు ప్రచారం కల్పించడానికి రూ.50 కోట్లు కేటాయించింది.
46 పర్యటక పథకాలు
హాపూర్ జిల్లాలో ఉన్న గర్ముకెటేశ్వర్ ఆలయాన్ని అభివృద్ధి చేయడం, గోరఖ్‌పుర్‌లోని రామ్‌గర్ తాల్ ప్రాంతంలో జల క్రీడల అభివృద్ధి సహా ప్రముఖ పర్యటక స్థలాల్లో హెలీపోర్టులు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. 46 పర్యటక పథకాలను అమలు చేయడానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది.