కేరళలో కరోనా బారిన పడిన వృద్ధ దంపతులు ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రిలో థామస్ అబ్రహం, ఆయన భార్య మరియమ్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకోవటం అద్బుతమని వైద్యులు అన్నారు.
దేశంలో కరోనా నుంచి కోలుకున్న అత్యంత వయస్కుడిగా థామస్ అబ్రహం రికార్డు సృష్టించారు. ఆయన వయసు 93 ఏళ్లు. మరియమ్మ వయసు 88ఏళ్లు.
25 రోజులపాటు..
థామస్ అబ్రహం, మరియమ్మ కరోనా లక్షణాలతో మార్చి 9న ఆసుపత్రిలో చేరారు. ఇన్ని రోజులపాటు కరోనాపై పోరాడి చివరికి గెలిచారని ఓ అధికారి తెలిపారు.
"వాళ్లు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్లకు చేసిన తాజా పరీక్షల్లోనూ కరోనా నెగటివ్ రావటం వల్ల డిశ్చార్జి చేయాలని నిర్ణయించాం. "
- రాష్ట్ర ప్రభుత్వ అధికారి
పథనంతిట్ట జిల్లా రాన్ని గ్రామానికి చెందిన థామస్, మరియమ్మకు వారి కుమారుడు, కోడలు, మనమడి నుంచి వైరస్ సోకింది. వీరంతా ఇటలీ నుంచి గత నెల కేరళకు వచ్చారు.
ఇదీ చూడండి: ఆపరేషన్ కరోనా: వెంటిలేటర్ల కొరత తీరే దారేది?