గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి నోయిడా నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు నగరపాలిక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సెక్టార్-94లోని మహామాయా పైవంతెన వద్ద 1250 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ రాట్నాన్ని రూపొందించింది. ఈ చరఖా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎం.పి మహేశ్ శర్మ, నోయిడా అథారిటీ సీఈఓ రీతూ మహేశ్వరి, ఎమ్ఎల్ఎ పంకజ్ సింగ్ ప్రారంభించారు.
నోయిడాను ప్లాస్టిక్ రహిత నగరంగా చేసేందుకు నగరపాలిక ప్రయత్నిస్తుందని.. ఈ నేపథ్యంలో గాంధీ నూలు వడికే రాట్నం ఆకారాన్ని ప్రచారం కోసం తీర్చిదిద్దిన్నట్లు స్మృతి ఇరానీ తెలిపారు.
గాంధీ పిలుపునిచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ దుస్తుల ధారణను ఈ రాట్నం ప్రతిబింబిస్తుందన్నారు స్థానిక అధికారులు. 14 అడుగుల ఎత్తు..20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ రాట్నం బరువు 1650 కిలోల బరువుంది.
ఇప్పటివరకూ ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించిన అతిపెద్ద చరఖాగా ఇది గుర్తింపు పొందింది. ఈ రాట్నం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందినట్లు నోయిడా అథారిటీ సీఈఒ రీతూ మహేశ్వరీ పేర్కొన్నారు.
గాంధీ స్ఫూర్తితో ప్లాస్టిక్ రీసైక్లింగ్, చెత్తను పారవేయటంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నోయిడా అథారిటీ దృష్టి సారిస్తోందని జనరల్ మేనేజర్ రాజీవ్ త్యాగి తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రయత్నాన్ని మరింత విస్తృతం చేసి...ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరుస్తామని అన్నారు.
ఇదీ చూడండి : నిర్లక్ష్యం పాపను డ్రైనేజీలో పడేస్తే.. మానవత్వం కాపాడింది!