దిల్లీ నుంచి 82 కిలోమీటర్ల దూరంలో ఉండే మేరఠ్ మధ్య ఆధునిక రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌లో తొలిసారిగా రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కింద దీన్ని నడపనున్నారు. ఇది గంటకు 180 కి.మీ. వేగంతో నడుస్తుంది. రోడ్డుమార్గంలో 3-4 గంటలు పట్టే దిల్లీ-మేరఠ్ ప్రయాణం దీనివల్ల 60 నిమిషాలకు తగ్గిపోనుంది. గుజరాత్‌లోని బంబార్డియర్ రైల్ ప్లాంట్‌లో తయారు చేస్తున్న ఈ రైలు నమూనాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా శుక్రవారం విడుదల చేశారు.
దిల్లీలోని లోటస్ టెంపుల్‌ను ఆధారంగా చేసుకొని నమూనాను రూపొందించారు. దీని వల్ల లోపలికి సహజమైన వెలుతురు, గాలి వస్తాయి. ఇది మెట్రో కంటే మూడు రెట్ల వేగంతో దూసుకుపోతుంది. త్రీ కార్ ట్రైన్‌లో 900 మంది, 6 కార్ ట్రైన్‌లో 1,790 మంది ప్రయాణించడానికి వీలవుతుంది. 2025 నాటికి ఈ కారిడార్ ప్రారంభమవుతుంది.
దీని ద్వారా దిల్లీ-మేరఠ్ మార్గంలో రోజుకు 8 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని అంచనా. ఆర్‌ఆర్‌టీఎస్-1 కింద దీంతో పాటు మరో రెండు దశల్లో దిల్లీ-గురుగ్రామ్-షాజహాన్‌పుర్, నిమ్రానా, బేరోర్ అర్బన్ కాంప్లెక్స్ (రాజస్థాన్), దిల్లీ-పానిపత్‌ల మధ్య చేపడతారు. ఎన్‌సీఆర్‌టీసీ ప్రస్తుతం మేరఠ్ మార్గంలో రైళ్ల రాకపోకల కోసం 30 రైళ్లను కొనుగోలు చేస్తోంది. అలాగే మేరఠ్‌లో స్థానిక రవాణా సౌకర్యాల కోసం మూడు కార్లతో కూడిన పది రైళ్లను కొంటోంది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్‌సీఆర్‌టీసీ.. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.3,750 కోట్ల రుణం తీసుకుంటోంది.
ఇదీ చూడండి: బిహార్ ఎన్నికల ఫైట్: ఎవరి సత్తా ఎంత..?