దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్తగా 52,050 మంది వైరస్ బారినపడ్డారు. మరో 803 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుసగా ఆరో రోజు 50 వేలకుపైగా కేసుల నమోదయ్యాయి. దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 12 లక్షల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
సానుకూలంగా రికవరీ రేటు..
మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో 66.31 శాతం రికవరీ రేటు ఉంది. మరణాల రేటు 2.1 శాతం నమోదైంది. మొత్తం కేసుల సంఖ్యలో విదేశీయులు కూడా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
పరీక్షల్లో పురోగతి..
కరోనా నిర్ధరణ పరీక్షల్లో రోజురోజుకూ భారత్ పురోగతి సాధిస్తోంది. ఆగస్టు 2న అత్యధికంగా 6,61,892 శాంపిళ్లు పరీక్షించారు. మొత్తం పరీక్షల సంఖ్య 2.08 కోట్లకు చేరిందని ఐసీఎంఆర్ మీడియా సమన్వయ కర్త డాక్టర్ లోకేశ్ శర్మ వెల్లడించారు. జులైలో రోజుకు సగటున 3.39 లక్షల టెస్టులు చేసినట్లు తెలిపారు. దేశంలో 917 ప్రభుత్వ, 439 ప్రైవేటు రంగ ల్యాబుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.