How to Prepare Mixed Veg Badam Soup: చలి విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది వెచ్చదనం కోసం రకరకాల సూప్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. అలాంటివారికోసమే అద్దిరిపోయే ఓ సూప్ తీసుకొచ్చాం. అదే "మిక్స్డ్ వెజ్ బాదం సూప్". ఈ సూప్‌లోని పోషకాలు ఎంతో ఆరోగ్యానిస్తాయి. డైట్లో ఉన్నవారికి, ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ఈ సూప్ తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు కావాల్సిన అవసరం లేదు. కేవలం తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ సూప్‌కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- బాదం పప్పులు - 15
- పంచదార - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఫ్రెంచ్ బీన్స్ - 4
- క్యారెట్ - 1 (చిన్నది)
- స్వీట్ కార్న్ - 2 టేబుల్ స్పూన్లు(ఫ్రోజెన్)
- బఠానీ - 2 టేబుల్ స్పూన్లు (ఫ్రోజెన్)
- నూనె - 1 టీ స్పూన్
- బటర్ - 1 టీ స్పూన్
- అల్లం తరుగు - 1 టీ స్పూన్
- వెల్లుల్లి తురుము - 1 టీ స్పూన్
- పచ్చిమిర్చి - 2
- నీళ్లు - సరిపడా
- మిరియాల పొడి - 1 టీ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్‌ను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి తగినన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు బాదం వేసి ఓ 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో పాన్ పెట్టి తగినన్ని నీళ్లు పోసి పంచదార, టీ స్పూన్ ఉప్పు, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి 90 శాతం ఉడికించుకోవాలి.
- వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత వాటిని చల్లటి నీళ్లలో ఓ నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత నీళ్లు లేకుండా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఫ్రోజెన్ స్వీట్ కార్న్, బఠానీ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తాజా బఠానీ, స్వీట్ కార్న్ తీసుకున్నట్లయితే వాటిని క్యారెట్ ముక్కలతో కలిపే ఉడికించుకుని తీసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె, బటర్ వేసుకోవాలి. బటర్ కరిగేలోపు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగి మంచి వాసన వస్తున్నప్పుడు గ్రైండ్ చేసుకున్న వెజిటేబుల్ పేస్ట్ వేసి ఓ నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత 400 ml వాటర్, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ మీద సూప్ మరిగేంతవరకు కుక్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు పైన నురగ ఏర్పడుతుంది. దానిని తీసేయాలి.
- ఆ తర్వాత బాదం పేస్ట్ వేసి వెంటనే కలపాలి. లేకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద సూప్‌ను చిక్కబడేంతవరకు ఓ 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ మిక్స్డ్ వెజ్ బాదం సూప్ రెడీ.
- నచ్చితే ఈ సూప్‌ను మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి..
టేస్టీ అండ్ హెల్దీ "బీట్రూట్ సూప్"- ఇలా చేస్తే నిమిషాల్లోనే కమ్మటి రుచి!
చిరు జల్లుల వేళ వేడివేడిగా "క్యారెట్ జింజర్ సూప్"- నిమిషాల్లో అద్దిరిపోయే టేస్ట్!