Gold Robbery Case In Hyderabad : రోజురోజుకూ నగరంలో బంగారం దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. దొంగలకు పాత చెప్పైనా బంగారమే. జ్యువెలరీ దకాణాల్లో షాపింగ్ చేస్తానని వచ్చి సిబ్బంది కళ్లుగప్పి దోపిడీలకు పాల్పడుతున్నారు. బంగారం షాపు సిబ్బంది చూడకుండా వారిని మాటల్లో పెట్టి.. అందిన కాడికి ఘరానా దొంగలు దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో జ్యువెలరీ షాపుల్లో బంగారం దొంగిలించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ ఆమెను పట్టించింది మాత్రం ఆమె వేసుకొనే చెప్పులు. ఏంటి చెప్పులేలా పట్టించాయని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీరే చదివేయండి.
పోలీసులు వివరాల ప్రకారం : ఈ నెల 22న మధ్యాహ్నం జాతీయ రహదారిలోని సీఎంఆర్, సాయంత్రం కేపీహెచ్‌బీ ఒకటో రోడ్డులోని దేవి జ్యువెలరీ, 23న కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని నకోడా జ్యువెలరీ, 24న హైదర్‌నగర్ సమీపంలోని సిరి జ్యువెలరీలో గుర్తు తెలియని మహిళ నగలు దొంగలించినట్లు తనిఖీల్లో వెల్లడైంది.
చెప్పులతో ఆచూకీ : ఈ నెల 25న జ్యువెలరీ యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని 60 సీసీ ఫుటేజీలను పరిశీలించి సిరి జ్యువెలరీలో ఓ మహిళ నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. కానీ, ఆమె మాస్కు ధరించి చోరీకి పాల్పడింది. దీంతో ఆ వీడియోలోని ఆమె చెప్పులను గమనించారు. సీసీ కెమెరాల ఆధారంగా మియాపూర్ పరిధి గోకుల్‌ప్లాట్స్‌లోని మహిళ ఇంటికి చేరుకున్న పోలీసులకు ఆ చెప్పులు కనిపించాయి. నిర్ధారణ చేసుకొని ఆ ఇంట్లో ఉన్న మహిళను విచారించారు. దీంతో మిగతా జ్యువెలరీల్లో కూడా తానే ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపింది. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా పుట్ట సునీత(41)గా గుర్తించారు. పోలీసులు 23 తులాల ఆభరణాలు స్వాధీనం చేసుకుని మంగళవారం ఆమెను రిమాండ్‌కు తరలించారు.
నగరంలో పెరుగుతున్న దొంగతనాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఊరికి వెళ్తే ఇంట్లో ఉన్న బంగారం, నగదును బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే పెట్రోలింగ్ సమయాల్లో మీ ఇంటివైపు గమనిస్తారన్నారు.
షాపు యజమాని బంగారం శుద్ధి చేయమని పంపిస్తే - గుమాస్తా ఏం చేశాడో తెలుసా?
ఆ SBI బ్యాంకులో 500 మందికి చెందిన బంగారం చోరీ - మీది ఉందో, పోయిందో చెక్ చేసుకోండి