ఒకవైపు కొత్త రకం కరోనా వైరస్ వార్తలతో కాస్త ఆందోళనగా ఉన్నా.. త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందనే అంచనాలు, మరణాలు, క్రియాశీల కేసుల తగ్గుదలతో భారత్‌లో కాస్త సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతానికి దేశంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. రికవరీ రేటు కూడా మెరుగ్గా కనిపిస్తోంది. మరోవైపు క్రియాశీల కేసుల కొండ తరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అవి జులై నెల స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ మధ్యలో ఆ కేసుల సంఖ్య పది లక్షలకు చేరువైంది. ఇక అప్పటి నుంచి వాటిలో క్షీణత కనిపిస్తోంది. డిసెంబర్ 23 నాటికి ఆ సంఖ్య 2,83,849కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఆ రేటు కూడా 2.80 శాతానికి తగ్గి ఊరట కలిగిస్తోంది.
రోజూవారీ కేసులు 30వేలకు దిగువనే..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ, రోజూవారీగా నమోదయ్యే కేసులు సంఖ్య మాత్రం అదుపులోనే ఉంది. ఒకదశలో ఈ మహమ్మారి కారణంగా రోజుకు దాదాపు లక్షల కేసులు నమోదుకాగా, ఇప్పుడు కాస్త తోకముడిచినట్లే కనిపిస్తోంది. డిసెంబర్ 14 నుంచి (గత 11 రోజులుగా) 30 వేలకు దిగువనే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. డిసెంబర్ 22న ఆ కేసుల సంఖ్య 20 వేలలోపుకు పడిపోయింది. 27 రోజులుగా రోజూవారీ పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం.
80 శాతం కొత్త రికవరీలు..10 రాష్ట్రాల నుంచే..
దేశంలో కొవిడ్-19 బారిన పడి కోలుకునే వారి సంఖ్య మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు కోటిమందికి పైగా వైరస్ బారిన పడగా..96,93,173 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 95.75 శాతానికి పెరిగింది. 79.56 శాతం కొత్త రికవరీలు 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచే ఉండటం గమనార్హం. ఈ విషయంలో మహారాష్ట్ర ముందుంది. అక్కడ కొత్తగా 7,620 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు.
ఆ పది రాష్ట్రాల్లోనే పాజిటివ్ కేసులు..
కేరళలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 6,169 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఆ తరవాత మహారాష్ట్రలో 3,913 మంది వైరస్ బారినపడ్డారు. 76శాతం కొత్త కేసులు పది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పదింటిలో చివరగా ఉన్న దేశ రాజధాని నగరం దిల్లీలో 871 మంది వైరస్ సోకింది.
400లకు దిగువనే మరణాలు..
గత 12 రోజులుగా వైరస్‌తో మృతి చెందేవారి సంఖ్య 400కు దిగువనే ఉంటుంది. డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 24 వరకు ఆ సంఖ్య అలాగే కొనసాగుతోంది. బుధవారం 312 మంది మరణించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,46,756 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.
ఇదిలా ఉండగా..డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా 16,53,08,366 మంది కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే 10,39,645 మంది నమూనాలను సేకరించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా మరో 24,712 మందికి కరోనా