విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనంపై ఎన్ఐపీఎఫ్పీ(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలసీ అండ్ ఫైనాన్స్) , ఎన్సీఏఈఆర్(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్), ఎన్ఐఎఫ్ఎం(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్) సంస్థలు పరిశోధన జరిపి ఓ నివేదిక రూపొందించాయి.
భారతీయులు అక్రమంగా విదేశాల్లో జమచేసిన నగదు విలువ రూ.14లక్షల కోట్ల నుంచి 34 లక్షల కోట్ల(216 నుంచి 490 బిలియన్ డాలర్లు)వరకు ఉండొచ్చని అంచనా వేశాయి. 1980 నుంచి 2010 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించాయి.
రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మాస్యూటికల్, పాన్ మసాలా, గుట్కా, పొగాకు, సినిమా, విద్యా రంగాల నుంచే ఎక్కువగా నల్లధనం కూడబెట్టి ఉంటారని నివేదిక అంచనా వేసింది.
'స్టేటస్ ఆఫ్ అన్ అకౌంటెడ్ ఇన్‌కం బోత్ ఇన్సైడ్ అండ్ ఔట్‌సైడ్ కంట్రీ- ఏ క్రిటికల్ అనాలసిస్' పేరుతో స్టాండింగ్ కమిటీ రూపొందించిన నివేదికను లోక్‌సభ ముందుకు సోమవారం తీసుకువచ్చారు. నల్లధనం మూలాన్ని అంచనా వేసేందుకు ఎలాంటి ప్రమాణాలు లేవని నివేదికలో పేర్కొన్నారు.
ఎం. వీరప్ప మొయిలీ నేతృత్వం వహించిన పార్లమెంటరీ ప్యానెల్ ఈ నివేదికను మార్చి 28 నే 16వ లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించింది.
మూడు సంస్థలు రూపొందించిన నివేదిక ఆధారంగా నల్లధనం ఎంత మొత్తం ఉంటుందో ఓ అంచనాకు రాలేమని ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు.
దేశ విదేశాల్లోని నల్లధనంపై పరిశోధనలు జరిపి నివేదిక రూపొందించాలని 2011 మార్చిలో ఎన్ఐపీఎఫ్పీ, ఎన్సీఏఈఆర్, ఎన్ఐఎఫ్ఎంలను ఆర్థిక శాఖ ఆదేశించింది. నల్లధనాన్ని గుర్తించేందుకు ఆర్థిక శాఖ అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఈ నివేదిక సూచించింది.
ఇదీ చూడండి: 'మన ప్రధానమంత్రి మంచి సేల్స్‌మన్'