భారతీయుల గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటోందని 'ఇండియన్ హార్ట్ స్టడీ-ఐహెచ్ఎస్' నివేదిక వెల్లడించింది. నిమిషానికి సగటున 72 సార్లు స్పందించాల్సిన హృదయం.. 80 సార్లు కొట్టుకుంటోందని తెలిపింది.
రక్తపోటు విషయంలోనూ ఇతర దేశస్థులతో పోల్చితే భారతీయుల్లో వ్యత్యాసం ఉన్నట్లు ఐహెచ్ఎస్ వెల్లడించింది. భారతీయుల్లో ఉదయంతో పోల్చితే సాయంత్రం వేళల్లో బీపీ ఎక్కువగా ఉంటుందని తేల్చింది.
2018 ఏప్రిల్ నుంచి 9 నెలల పాటు.. 15 రాష్ట్రాల్లోని 355 నగరాల్లో 18,918 మందిపై పరిశోధన చేసి, ఈ నివేదిక రూపొందించారు. 19 మంది వైద్యులు రక్తపోటుకు సంబంధించిన మందుల మోతాదుపై పునరాలోచించేందుకు ఈ పరిశోధన చేపట్టారు.
"ఈ అధ్యయనం ద్వారా మాకు భారతీయుల్లోని వైట్ కోట్ హైపర్ టెన్షన్, మాస్క్డ్ హైపర్ టెన్షన్పై కీలక విషయాలు తెలిశాయి."
-డాక్టర్ సౌమిత్రా కుమార్, ఐహెచ్ఎస్ సమన్వయకర్త
మాస్క్డ్, వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే?
మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటే... వైద్యుల వద్ద బీపీ లెక్కిస్తే సాధారణంగానే ఉంటుంది. కానీ ఇంట్లో ఎక్కువగా నమోదవుతుంది.
వైట్ కోట్ హెపర్ టెన్షన్ కేసుల్లో... ఆసుపత్రిలో చూస్తే మాత్రమే రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. భారతీయుల్లో తొలిసారి ఆస్పత్రికి వెళ్లిన 42శాతం మందిలో ఈ సమస్య ఉంటుందని అంచనా.
లెక్కలతో ప్రాణానికే చిక్కులు...
మాస్క్డ్ హైపర్ టెన్షన్ కేసుల్లో... బీపీ అధికంగా ఉందని గుర్తించలేక సరైన చికిత్స అందడంలేదు. వైట్ కోట్ హైపర్ టెన్షన్ కేసుల్లో... బీపీ సాధారణంగానే ఉన్నా అనవసరంగా ఔషధాలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ రెండు పరిస్థితులు... గుండె, మూత్రపిండాలు, మెదడు సమస్యలకు దారితీసి, అకాల మరణానికి కారణం అవుతున్నాయి.