వచ్చే 4-5 ఏళ్లలో భారత్ నుంచి ఆయుధ ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఛైర్మన్ జి. సతీశ్ రెడ్డి గురువారం తెలిపారు. భారత సాయుధ బలగాల్లో స్వదేశీ ఉపకరణాల శాతం కూడా బాగా పెరుగుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన ఒక వెబినార్లో పేర్కొన్నారు. ఆయుధ ఉత్పత్తిలో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం, డీఆర్డీఓ అనేక చర్యలను చేపట్టాయన్నారు.
"మేం చేపట్టే ప్రతి ప్రాజెక్టులోనూ పరిశ్రమల నుంచి అభివృద్ధి, ఉత్పత్తి భాగస్వాములను ఆహ్వానిస్తున్నాం. క్షిపణులు వంటి కీలక వ్యవస్థల్లోనూ ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాం."
-జి సతీశ్ రెడ్డి, డీఆర్డీఓ ఛైర్మన్
సైనిక దళాలకు అవసరమయ్యే అధునాతన ఆయుధాల డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి దేశంలో సాగినప్పుడే నిజమైన ఆత్మ నిర్భర్ సాధ్యమవుతుందని చెప్పారు. ఆకాశ్ క్షిపణుల ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల సమ్మతించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతి దేశాల్లో భారత్ కూడా ఉంది. వచ్చే ఐదేళ్లలో మన దేశం ఆయుధాల కొనుగోళ్ల కోసం 130 బిలియన్ డాలర్ల మేర ఖర్చు పెట్టే అవకాశం ఉందని అంచనా.
కోబ్రా కమాండోలుగా మహిళలు?
అటవీ ప్రాంత పోరాటాల్లో నిష్ణాతులతో కూడిన కమాండో దళం కోబ్రాలోకి మహిళలనూ చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ అధిపతి ఎ.పి. మహేశ్వరి తెలిపారు. 12వేల మంది సిబ్బందితో కూడిన 10 కోబ్రా బెటాలియన్లు 2009లో ప్రారంభమయ్యాయి. సీఆర్పీఎఫ్లో భాగంగా పనిచేసే ఈ దళాలు.. అటవీ ప్రాంతాల్లో చేపట్టే ప్రత్యేక ఆపరేషన్లలో పాలుపంచుకుంటాయి. వీటిలో చాలావరకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో మోహరించాయి.
ఇదీ చదవండి : శశికళకు కరోనా పాజిటివ్