దేశంలోని ఆవిష్కర్తల ప్రతిభతో రానున్న 10-15 ఏళ్లల్లో భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో డెఫ్-కనెక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే కాలంలో రక్షణ ఆవిష్కరణలలో భారత్ రాణిస్తుందని వెల్లడించిన రాజ్‌నాథ్‌సింగ్, అంకురాల స్థాపనకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని గుర్తు చేశారు.
అంకుర సంస్థలు సత్ఫలితాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్న ఆయన భవిష్యత్తులో రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
''భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇంతటి ప్రతిభావంతులైన ఆవిష్కర్తలు మన దగ్గర ఉంటే.... ఐదు ట్రిలియన్ డాలర్లు ఏంటీ రానున్న 10, 15 ఏళ్ల కాలంలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుంది.''
-రాజ్‌నాథ్‌సింగ్, రక్షణశాఖ మంత్రి
దేశాభివృద్ధిలో జ్ఞానం, శక్తి సంయుక్తంగా కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. జ్ఞానం, శక్తిని కలిపి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే వేదికగా ఐడెక్స్ నిలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక్కడ జ్ఞానం అంకురాలకు ప్రతీకగా నిలిస్తే, శక్తికి సైన్యం ప్రతీకగా నిలుస్తోందని స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటివి దేశంలో అంకురాల స్థాపనకు సహాయక వాతావరణాన్ని కల్పిస్తున్నాయని రాజ్‌నాథ్ అన్నారు.
ఇదీ చూడండి:వెంకయ్య నిర్ణయం... మన్మోహన్‌కు కీలక బాధ్యత