దేశంలో లాక్‌డౌన్‌ను మరోమారు పొడిగించినట్లయితే ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడుతుందని... భారత్ తన కన్ను తానే పొడుచుకున్నట్లు అవుతుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. లాక్డౌన్ పొడిగించడం వల్ల లక్షలాదిమంది ప్రాణాలు కాపాడవచ్చు కానీ.. సమాజంలో బలహీన వర్గాల ప్రజలు భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.
"గత కొన్ని రోజులుగా లాక్డౌన్ కఠినంగా అమలు చేసినప్పటకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే అధిక జనాభా గల మన దేశంలో కేసుల సంఖ్య పెరుగుదల అనివార్యం. దీని అర్థం లాక్డౌన్ వల్ల ఉపయోగం లేదని కాదు. భారత్ సాముహికంగా వైరస్‌పై పోరాటం చేస్తూ లక్షలాదిమంది ప్రాణాలు కాపాడుకుంటోంది. ప్రపంచంలో కరోనాతో మరణించినవారి సగటు(మిలియన్ మందికి) 35, అమెరికాలో 228గా ఉంది. వాటితో పోల్చిస్తే భారత్‌లో కరోనా మరణాల రేటు 1.4శాతమే." -ఆనంద్ మహీంద్రా, మహీంద్ర గ్రూప్ చైర్మన్
క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలి!
లాక్డౌన్.. సమాజంలోని బలహీన వర్గాలపై అధిక ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ లైన్లుతో కూడిన ఆసుపత్రులను నిర్మించాల్సిన అవసరం ఉందని... విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు చేయాలని సూచించారు. వైరస్ నిర్మూలనకు కేవలం కంటైన్మెంట్ జోన్లపైనే కాకుండా క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలని, వైరస్ ప్రభావం అధికంగా ఉన్నవారిని కాపాడాలని మహీంద్రా చెప్పారు.
'మనం కరోనాతోనే ఉండాలి. పర్యటక వీసా మీద వైరస్ ఇక్కడికి రాలేదు. దానికి ముగింపు గడువు లేదు', అంటూ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: మన్మోహన్‌కు కరోనా నెగిటివ్- నిలకడగా ఆరోగ్యం