తూర్పు లద్దాక్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్ - చైనా బలగాల జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది జవాన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్ని రక్షించే క్రమంలో వారు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న షా.. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. ఈ వీర జవాన్ల త్యాగాలకు దేశం సెల్యూట్ చేస్తోందని ట్విట్టర్లో పేర్కొన్నారాయన. ఆ సైనికుల ధైర్యం భరతమాతను కాపాడుకోవడం పట్ల ఉన్న నిబద్ధతను స్పష్టం చేస్తోందన్నారు.
ఇంతటి గొప్ప ధీరత్వం కలిగిన హీరోలను భారత సైన్యానికి అందించిన ఆ కుటుంబాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అమిత్ షా తెలిపారు. సైనికుల అత్యున్నత త్యాగాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ఆయన అన్నారు. జవాన్లను కోల్పోయిన ఈ దుఃఖ సమయంలో ఆయా కుటుంబాలకు ప్రధాని మోదీతో సహా.. యావత్ దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. చైనా సైనికుల దాడిలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: 'మోదీజీ... సరిహద్దు ఘర్షణపై మౌనం వీడండి'