అమెరికా హ్యూస్టన్ నగరాన్ని హౌదీ మోదీ నినాదం ఊపేస్తోంది. ఈ నెల 22న జరిగే ఈ కార్యక్రమంలో 50 వేలకుపైగా ప్రవాసభారతీయులు, చట్టసభ సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
చమురు కోసం..
భారత్‌కు ప్రధాన చమురు ఎగుమతిదారు ఇరాన్. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా పలు ఆంక్షలు అమలుచేస్తోంది. ఫలితంగా భారత్‌కు ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆగిపోయాయి. భారత్ మరో దేశంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అమెరికా వైపు చూస్తోంది. అమెరికా చమురు వ్యాపారులకూ భారత్ అవకాశాల మార్కెట్‌గా కనిపిస్తోంది. మరో వైపు వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను చైనా నిలిపివేసింది. ఫలితంగా భారత్-అమెరికా ఇంధన భాగస్వామ ఒప్పందం కుదిరింది.
అందుకే ప్రపంచ చమురు రాజధానుల్లో ఒకటైన హ్యూస్టన్‌లో దాదాపు 16 చమురు కంపెనీల సీఈఓలతో మోదీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
అంతకు మించి
హ్యూస్టన్ నగరంతో భారత్‌కు అవినాభావ సంబంధం ఉంది. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యంలో హ్యూస్టన్ నాలుగో అతిపెద్ద గేట్‌వే. ఈ వ్యాపారం విలువ సుమారు 430 కోట్ల డాలర్లు.
హ్యూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సుమారు 28 కంపెనీలు భారత్‌లో 69 అనుబంధ కంపెనీలను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడం మోదీ లక్ష్యం. అలాగే ప్రవాస భారతీయుల్ని.. మాతృదేశానికి సేవలందించేలా కార్యోన్ముఖులను చేయడమూ మోదీ ముందున్న కర్తవ్యం.
ట్రంప్‌కు అది కావాలి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్నారు. కనుక హ్యూస్టన్‌లోని ప్రవాస భారతీయుల మద్దతు అవసరం. డెమోక్రాట్లకు మద్దతు పలికే భారతీయుల్ని ఈ మారు ఎలాగైనా రిపబ్లికన్ పార్టీవైపు తిప్పుకోవడం ట్రంప్ ప్రధాన లక్ష్యం. అలాగే భారత్ వ్యవసాయం, పాడి పరిశ్రమల్లో అమెరికా బహుళజాతి కంపెనీలు పాలుపంచుకునేందుకు అవకాశం దొరకబుచ్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: వేలాది 'నకిలీ వార్తల' ఖాతాలపై ట్విట్టర్ వేటు