భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా.. ఇరుదేశాల ఉన్నతాధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. వాణిజ్య సమస్యలతో పాటు మరిన్ని కీలకాంశాలపై దక్షిణ, మధ్య ఆసియా యూఎస్ వాణిజ్య ప్రతినిధి (ఏయూఎస్టీఆర్) క్రిస్టోఫర్ విల్సన్ నేతృత్వంలోని బృందం.. భారత అధికారులతో సమావేశం అయింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించి పరస్పరం ఫలితాలు పొందే విధంగా ఈ చర్చలు జరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ తెలిపింది.
ఇరుదేశాల వాణిజ్య వివాదాలపై చర్చలు జరగాలని ఒసాకా సమావేశం సందర్భంగా మోదీ, ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగా శుక్రవారం భారత్- అమెరికా అధికారుల భేటీ జరిగింది.
వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్తోనూ క్రిస్టోఫర్ విల్సన్ బృందం సమావేశం అయింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా యూఎస్ అధికారులతో సమావేశం జరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
" భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు యూఎస్ వాణిజ్య ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యాను. ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు అనేక సమస్యలపై చర్చించాం."
- పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి