వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభంతో కరోనాపై పోరులో చివరి దశకు చేరుకున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారిపై దేశం విజయవంతంగా పోరాడిందని తెలిపారు. కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని భద్రవతి గ్రామం వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు షా. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"ఏడాదిగా కరోనాపై ప్రపంచం జరుపుతున్న పోరులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి వ్యాప్తి.. ప్రారంభంలో భారత్ సహా పలు దేశాలపై నిపుణులు సందేహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మన దేశంలో పరిశోధనలు జరిపేందుకు కేవలం ఒక్క ప్రయోగశాల మాత్రమే ఉంది, ఇప్పుడు 2000 ఉన్నాయి. మనం అందరం కలిసికట్టుగా పోరాడటం వల్లే విజయం సాధించాము."
-అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి.
సీఎంకు ధన్యవాదాలు..
ఆర్ఏఎఫ్ క్యాంపస్ నిర్మాణానికి స్థలం కేటాయించడంలో కృషి చేసినందుకు సీఎం యడియూరప్పకు అభినందనలు తెలిపారు షా. కేంద్రీయ విద్యాలయాలను, మైదానాలను స్థానికులు ఉపయోగించుకునే రీతిలో తీర్చిదిద్దుతామని అన్నారు. 50.29 ఎకరాల స్థలంలో రూ.230 కోట్లతో ఈ క్యాంపస్‌ను నిర్మించనున్నారు.
'5 ఏళ్లు కాదు.. మళ్లీ మాదే అధికారం'
కర్ణాటకలో భాజపా ఐదేళ్లు పూర్తి చేసుకోవడమే కాక వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో భాజపా కొనసాగడంపై వస్తున్న విమర్శలపై ఈ విధంగా స్పందించారు. ప్రతిపక్షాలు భాజపాను తప్పుపట్టడం మానుకొని ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి : 'భారత్-నేపాల్ బంధం ప్రభుత్వాలకే పరిమితం కాదు'