సీఓపీ సదస్సు...
ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణ సమస్యను ఎదుర్కొనేందుకు యూఎన్సీసీడీలోని 'కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-14 (సీఓపీ-14)' ఈ ఏడాది భేటీ కానుంది. సెప్టెంబర్ 2-13 మధ్య జరిగే ఈ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో జరిగిన ముందస్తు సమావేశంలో పలు అంశాలు వెల్లడించారు కేంద్ర మంత్రి.
ఈ సదస్సుకు సుమారు 200 దేశాలకు చెందిన 3వేల మంది ప్రతినిధులు, 100 మంది మంత్రులు హాజరవుతున్నారని చెప్పారు జావడేకర్. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై కీలక అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు.
"ప్రపంచంలోని 3వ వంతు భూములు సారం కోల్పోయాయి. అది 40 వేల లక్షల హెక్టార్లుగా ఉంది. భారత్‌లో 29 శాతం భూమి సారం కోల్పోయింది. ఇది మన ముందున్న పెద్ద సమస్య. దానిని సారవంతంగా మార్చుతాం. అడవులను నరకటం, భూగర్భ జలాలను విపరీతంగా తోడేయటం, వరదలు వంటి పలు కారణాలతో భూములు పూర్తిగా నాశనమవుతున్నాయి. ఈ భూములను పునరుద్ధరించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. "
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి.
ప్రత్యేక కేంద్రం...
ఎడారీకరణ సమస్యను ఎదుర్కొనేందుకు దెహ్రాదూన్‌లోని అటవీ పరిశోధన విద్యాసంస్థలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు జావడేకర్. భూసార క్షీణత సమస్యపై పరిశోధనలు చేసి దానికి పరిష్కార మార్గం చూపనుందన్నారు.
వచ్చే రెండేళ్లలో ఎడారీకరణను ఎదుర్కొనేందుకు చేపట్టే కార్యక్రమాల్లో భారత్ ప్రధాన పాత్ర పోషించనుందని తెలిపారు కేంద్ర మంత్రి. చైనా నుంచి సీఓపీ అధ్యక్షత బాధ్యతలను భారత్ తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రధాన పాత్ర పోషించనుందన్నారు. దీనికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: కశ్మీర్ పర్యటక రంగం అభివృద్ధికి కేంద్రం చర్యలు