భారత్‌లో తాము తయారు చేసిన స్పుత్నిక్-వి టీకాపై తొలిసారి ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి(ఆర్డీఎఫ్) సీఈఓ దిమిత్రేవ్ తెలిపారు. 2021లో సుమారు 300 మిలియన్ల స్పుత్నిక్ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రపంచంలోనే తొలుత అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్-వి టీకా.. 95 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
ఇదీ చూడండి: మా టీకా 95 శాతం సమర్థవంతం: పుతిన్
తుది దశలో ప్రయోగాలు..
స్పుత్నిక్ వ్యాక్సిన్ క్యాండిడేట్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోల్‌కతాలో జరగనున్నాయి. ఈ మేరకు పీర్లెస్ ఆసుపత్రి ఎథిక్స్ కమిటీ స్పష్టం చేసింది. సుమారు 100 మంది ఆరోగ్యవంతులపై టీకాను ప్రయోగించనున్నట్లు పేర్కొంది. డా.రెడ్డీస్ లాబొరేటరీస్, క్లినిమెడ్ లైఫ్‌సైన్సెస్ సహకారంతో డా.సుభ్రోజ్యోతి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
డా.రెడ్డీస్ లాబొరేటరీస్‌కు భారత్‌లో ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ).