పాకిస్థాన్‌లోని భారత హైకమిషన్ అధికారులను అపహరించి హింసించటాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు దిల్లీలోని పాక్ హైకమిషన్ ఛార్జ్ డీఆఫైర్స్ హైదర్ షాకు సమన్లు జారీ చేసింది భారత ప్రభుత్వం.
పాకిస్థానీ ఏజెన్సీలు భారత అధికారులను బలవంతంగా అపహరించాయని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. అక్రమంగా 10 గంటలకుపైగా కస్టడీలో ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
"భారతీయ అధికారులను విచారణ పేరుతో చిత్ర హింసలు పెట్టారు. వాళ్లపై భౌతిక దాడి చేశారు. అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌లోని భారత్ హైకమిషన్, భారత విదేశాంగ శాఖ తీవ్రంగా హెచ్చరించిన తర్వాత వదిలిపెట్టింది. వాళ్ల వీడియోలు తీశారు. కల్పిత ఆరోపణలను ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారు."
- భారత విదేశాంగ శాఖ ప్రకటన
భారత హైకమిషన్ సాధారణ కార్యకలాపాలను అడ్డుకునేందుకే పాక్ ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగ శాఖ ఆరోపించింది. అందుకే కొన్ని రోజులుగా భారత దౌత్య అధికారులే లక్ష్యంగా వేధిస్తోందని వివరించింది. భారత అధికారులపై తప్పుడు అభియోగాలను మోపేందుకు ప్రయత్నించిన పాక్ చర్యలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపింది.
పాక్ చర్యలు 1961లో జరిగిన వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని భారత్ పేర్కొంది. దౌత్యవేత్తల పట్ల పాటించాల్సిన నిబంధనలకు తూట్లు పొడిచిందని ఆగ్రహించింది.
పాక్ బుకాయింపు..
దౌత్య అధికారుల అరెస్టుపై భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని పాక్ బుకాయిస్తోంది. నేరానికి పాల్పడిన అధికారులను కాపాడేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
భారత్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ద్విము బ్రహ్మ, పాల్ సెల్వదాస్ను ఇస్లామాబాద్‌లోని ఎంబసీ రోడ్డులో అరెస్టు చేశారు. తమ వాహనంతో ఒక పాదచారిని ఢీకొట్టినట్లు ఆరోపించింది పాక్. విచారణ సమయంలో వీరి నుంచి నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. వీళ్లు భారత హైకమిషన్ అధికారులు అని తెలియగానే విడిచిపెట్టామని పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.
ఇదీ చూడండి: ఆ భారత అధికారులను తీవ్రంగా హింసించిన పాక్!