చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నందున భారత్ అప్రమత్తమైంది. వైరస్ తీవ్రత ఎక్కువగా వుహాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా దేశానికి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం వుహాన్ సహా చైనాలోని ఇతర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారన్న పక్కా సమాచారం తెలియక కేంద్రం అయోమయంలో పడింది.
వుహాన్‌లో 500మందికిపైగా భారతీయ విద్యార్థులు పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతున్నారు. అయితే అందులో చాలామంది చైనీస్ న్యూ ఇయర్ సెలవుల సందర్భంగా వుహాన్‌ను విడిచి వెళ్లినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 45మంది విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్నట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
"సాధారణంగా అక్కడ ఉన్న భారతీయులు కాన్సులేట్‌లో నమోదు చేసుకోరు. వారు పట్టణం విడిచి వెళ్తున్నప్పుడు కూడా కాన్సులేట్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వరు"
-విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి
చైనా వ్యాప్తంగా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 80మంది చనిపోయారు. 2,744 మందికి వైరస్ సోకగా.. 461మంది పరిస్థితి విషమంగా మారింది. మరో 6వేల అనుమానిత కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్‌లో ఎనిమిది మంది, మకావూలో ఐదుగురు, తైవాన్‌లో నలుగురు, తాజాగా నేపాల్‌లో ఒకరు వైరస్ బారిన పడ్డారు..
మోదీకి కేరళ సీఎం లేఖ..
వుహాన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అక్కడి భారతీయులను ప్రత్యేక విమానంలో తీసుకురావాలని కోరారు.
నేపాల్ సరిహద్దుకు వైద్య బృందాలు..
నేపాల్‌లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు తేలిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేక వైద్య బృందాలను తరలించింది. బంగాల్‌లోని పానితాంకి, ఉత్తరాఖండ్‌లోని జూలాఘాట్, జౌజూబీ ప్రాంతాల్లో వైద్య బృందాలను మోహరించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది.
కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష
నేపాల్ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బంగాల్, సిక్కింతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ సరిహద్దు దాటి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.