పాకిస్థాన్... పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)లో డైమర్-భాషా ఆనకట్ట నిర్మాణం చేట్టడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆక్రమించిన భారత భూభాగంలో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాక్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను భారత్ ఖండించింది.
చైనా సహకారంతో... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బుధవారం గిల్గిట్-బాల్టిస్థాన్‌లోని చిలాస్ వద్ద డైమర్-భాషా ఆనకట్ట నిర్మాణ పనులను ప్రారంభించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
"పీఓకే సహా జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లు... భారత్‌లో అంతర్భాగం. అందువల్ల ఇక్కడ పాకిస్థాన్ అక్రమ నిర్మాణం చేపట్టడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది."
- అనురాగ్ శ్రీవాస్తవ, భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి
పాక్- చైనా ఒప్పందం
డైమర్- భాషా ఆనకట్ట నిర్మాణం కోసం పాకిస్థాన్- చైనాలు 442 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పాకిస్థాన్ అక్రమ ప్రాజెక్టుకు చైనా సహకారం అందించడం సరికాదని భారత్ అభ్యంతరం తెలిపింది.
పాక్ దుర్నీతి...
అఫ్గాన్ వస్తువులను వాఘా నుంచి ఎగుమతి చేయడానికి పాకిస్థాన్ అనుమతించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా...
"అఫ్గానిస్థాన్ ట్రక్కులు అఫ్గాన్ సరకులు తీసుకెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతించడంలేదు. నిజానికి పాక్ గుత్తాధిపత్య రవాణా పద్ధతులను కోరుతోంది. అలాగే అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ ట్రాన్సిట్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఏపీటీటీఏ)ను కూడా అమలు కాకుండా చేస్తోంది. అంటే భారత్ సహా ఇతర దేశాల నుంచి అఫ్గాన్‌కు సరకుల రవాణాను నిరోధించి, బందీ మార్కెట్లను సృష్టించే విధానాన్ని పాకిస్థాన్ అనుసరిస్తోంది."
- అనురాగ్ శ్రీవాస్తవ, భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి
చివరికి పాకిస్థాన్ ఎంతగా దిగజారిందంటే... భారత్ మానవతా దృక్పథంలో అఫ్గాన్‌కు అందించాలనుకున్న గోధుమల రవాణాకు కూడా పాక్ మోకాలడ్డిందని అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు.
ఇదీ చూడండి: అమెరికాలో చదువుపై నీలినీడలు