ఎడారి మిడతల సమస్యపై చర్చించడానికి భారత్ ప్రతిపాదించిన సాంకేతిక సమావేశానికి హాజరయ్యేందుకు నిరాకరించింది దాయాది పాకిస్థాన్. ఈ నేపథ్యంలో పాక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్. పాక్ ప్రజలు ఆహార భద్రత ముప్పును ఎదుర్కొంటున్నప్పటికీ.. మిడతల నివారణకు కలిసి రాకపోవడం సరికాదని చెప్పింది. మిడతల సమస్యపై భారత్ ప్రత్యేక చొరవతో ఈ ప్రతిపాదన చేసిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.
"ఎడారి మిడతల వల్ల పొంచి ఉన్న పెను ముప్పుపై ముందే మేల్కోవడం ఎంతో ముఖ్యమని మేం భావిస్తున్నాం. అలాగే ఇరు దేశాలు సమన్వయంతో మిడత నియంత్రణ కార్యకలాపాలను చేపట్టాలని మేము పాకిస్థాన్‌కు ప్రతిపాదించాం. దానికి కావాల్సిన పురుగు మందులను భారత్ సమకూర్చుతుందని కూడా చెప్పాం."
-అనురాగ్ శ్రీవాస్తవ, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి
మిడతల నియంత్రణ కోసం భారత్... ఇప్పటికే 20,000 లీటర్ల పురుగుమందులను ఇరాన్‌కు అందించిందని చెప్పారు శ్రీవాస్తవ. వేగంగా పెరుగుతున్న మిడతల ముప్పును ఎదుర్కోవడానికి సమన్వయంతో పోరాడాలని పాకిస్థాన్, ఇరాన్‌లకు సూచించింది భారత్.
ఇదీ చూడండి: గల్వాన్ నదిని కప్పేయడానికి చైనా కుట్ర