ఎంపిక చేసిన కష్టమర్లకు మాత్రమే వేగవంతమైన ఇంటర్నెట్ అందించేలా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన ప్రత్యేక ప్లాన్ల కారణంగా మిగతా వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ. ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ముఖాముఖి ఇచ్చిన ఆయన టెలికాం సామగ్రి రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే తమ లక్ష్యమన్నారు. స్వదేశీ తయారీ రంగాన్ని దెబ్బతీసేలా కొన్ని దేశాలు వారి ఎలక్ట్రానిక్స్, టెలికాం సామగ్రిని దిగుమతి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.
ప్రశ్న: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వేగవంతమైన అంతర్జాల ప్లాన్ కొంతమందికి లాభిస్తుంది. కానీ మిగతా చందాదారులకు అందించే సేవల నాణ్యత తగ్గుతుంది కదా?
జవాబు: బీటీఎస్ బ్యాండ్ విడ్త్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలా ప్రత్యేక చందాదారులకు అందించే సేవల వల్ల సాధారణ వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ట్రాయ్ పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తుంది. అనంతరమే మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం.
ప్రశ్న: టెలికాం రంగం ఎంతో కీలకమైంది. ఈ నేపథ్యంలో టెలికాం రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించడం, డిజిటల్ సార్వభౌమాన్ని సాధించడం అవసరమని భావిస్తున్నారా?
జవాబు: మన స్వదేశీ ఉత్పత్తి రంగాన్ని దెబ్బ తీసే వ్యూహంతో కొన్ని దేశాలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తి సంస్థలు కుంటుపడిన అనంతరం ఆయా పరికరాల ధరలను భారీగా పెంచుతున్నాయి. ఈ వ్యూహాలను మనం గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. స్వదేశీ తయారీదారులకు ప్రోత్సాహకాలు కల్పించకపోతే ఈ రంగంలో విజయం సాధించలేం. 2022 నాటికి టెలికాం పరికరాల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలని సంకల్పించాం. ఈ రంగంలో పరిశోధన, డిజైన్ల రూపకల్పన, పరీక్షలు, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రూ. 1000 కోట్లతో ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నాం.
ప్రశ్న: చైనా ఉత్పత్తులను వాడకూడదని బీఎస్ఎన్ఎల్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెలికాం రంగంలో చైనా పరికరాలను నిషేధించడం అవసరమని భావిస్తున్నారా?
జవాబు: టెలికాం రంగంలో అవసరమైన సామగ్రిని దేశీయంగానే ఉత్పత్తి చేయగలమని నమ్ముతున్నాను. ఈ పరికరాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. దేశీయ తయారీ సంస్థలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. చైనా వస్తువులపై నిషేధం విధించడంపై కాక స్వయం సమృద్ధి సాధించడం పైనే దృష్టి కేంద్రీకరించాలి.
ప్రశ్న: ప్రసార రంగంలో నూతన టారిఫ్ విధానంపై మీ అభిప్రాయం?
జవాబు: పారదర్శకత, వివక్ష లేకుండా, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేలా కొత్త విధానం ఉంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్‌ను వీక్షించే సౌలభ్యం ఇందులో కలుగుతుంది. కొత్త విధానంతో టీవీ ఛానల్ ధరల్లో పారదర్శకత వచ్చిందని నిపుణులే విశ్లేషిస్తున్నారు.
ప్రశ్న: కరోనా వేళ టెలికాం సెక్టార్ పోషించే పాత్ర ఏమిటంటే.. మీ సమాధానం?
జవాబు: భౌతిక దూరం పాటిస్తున్న వేళ సాంకేతికత ప్రాధాన్యం పెరిగింది. రిమోట్ ఆధారిత కార్యాలయాలు, వర్చువల్ కాన్ఫరెన్స్‌లు, విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు, వినోదానికి వీడియో స్ట్రీమింగ్ వంటి ప్రాధాన్యాలు పెరిగాయి. విద్యుత్, బ్రాడ్ బ్యాండ్ అనేవి ప్రస్తుత ఆధునిక సమాజంలో నిత్యావసరాలుగా మారాయి.
ప్రశ్న: 2018 నాటి జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానాన్ని అమలు చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారా?
జవాబు: ఈ విధానం ప్రధానంగా మూడు అంశాలతో ముడిపడి ఉంది. అనుసంధానం, మరింత సాంకేతిక వృద్ధి, భద్రత అనేవి ప్రధాన సూత్రాలుగా పనిచేస్తుంది. అనుసంధానంలో భాగంగా అందరికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించడం.. సాంకేతిక వృద్ధిలో భాగంగా 5జీ, కృత్రిమ మేధస్సు, ఐఓటీ, క్లౌడ్, బిగ్ డేటా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భద్రత సూత్రంలో భాగంగా పౌరులందరికీ భద్రతే మా లక్ష్యం. 2022 నాటికి ప్రతి పౌరుడికి 50 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, గ్రామపంచాయతీలకు 10 జీబీపీఎస్ అంతర్జాల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
ప్రశ్న: భారత రైతులు, యువతకు సాంకేతికత ఏ విధంగా సాయం చేస్తుంది?
జవాబు: చాలా రంగాల్లో సాంకేతికత రైతులు, యువత జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రభావవంతమైన ప్రణాళిక, ఉత్పాదకతను పెంచడం, భద్రతతో కూడిన స్టోరేజీ వంటివి సాంకేతికతతో సాధ్యమవుతాయి. జాతీయ వ్యవసాయ మార్కెట్(ఈ-నామ్), మేఘ్‌దూత్ క్లౌడ్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.