2019లో దేశంలో రోజుకు సగటున 79 హత్య కేసులు నమోదయ్యాయని తాజా ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాదిలో మొత్తం 28,918 హత్య కేసులు వెలుగుచూశాయని...ఈ సంఖ్య 2018తో పోలిస్తే 0.3 శాతం తక్కువగా ఉన్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదికలో పేర్కొంది.
2019లో నమోదైన వాటిలో ఎక్కువగా 9,516 కేసులు వివాదాల వల్ల, 3,833 కేసులు వ్యక్తిగత కక్షల కారణంగా, మరో 2,573 కేసులు లాభాపేక్షతో జరిగినట్లు నివేదికలో పేర్కొంది. ఆ ఏడాదిలో 1,08,025 మంది బాధితుల ద్వారా మొత్తం 1,05,037 కేసులు నమోదయ్యాయి. 2018లో 1,05,734 కేసులతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గిందని తెలిపింది ఎన్సీఆర్బీ.
దేశంలో గత ఏడాదిలో అపహరణ కేసుల సంఖ్య 2018తో పోల్చితే 0.7 శాతం క్షీణించింది. కిడ్నాప్ అయిన బాధితులలో, 2019 లో 23,104 మంది పురుషులు, 84,921 మంది మహిళలు ఉన్నారు. వీరిలో అత్యధికంగా మంది పిల్లలే. కిడ్నాప్ అయిన వారిలో మొత్తం 95,551 మంది గుర్తించి.. ఇంటికి పంపించినట్లు వెల్లడించింది ఎన్సీఆర్బీ.
2018లో 2,278 మందిని అక్రమ రవాణా చేయగా... 2019లో ఈ సంఖ్య 2,260గా ఉంది. కానీ గణాంకాల ప్రకారం మొత్తం 6,616 మంది బాధితులు అక్రమ రవాణా కాగా వీరిలో ఎక్కువ మంది యువతని తెలిపింది. వీరిలో 6,571 మంది బాధితులను రక్షించినట్లు పేర్కొంది. ఈ అక్రమ రవాణాకు సంబంధించి మొత్తం 5,128 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. భారత శిక్షాస్మృతి, ఇతర స్థానిక చట్టాల కింద నమోదైన కేసుల ఆధారంగా ఈ డేటాను విశ్లేషించినట్లు ఎస్సీఆర్బీ వెల్లడించింది.