భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ముందున్న పలు సవాళ్ల గురించి ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డా. కిరణ్ కుమార్ వివరించారు. ప్రస్తుతం ఇస్రోకు 100కు పైగా ఉపగ్రహాల అవసరం ఉందన్నారు.
ఇస్రో ఛైర్మన్‌గా 2018 జనవరిలో పదవీవిరమణ చేశారు కుమార్. చంద్రయాన్-1, మంగళ్యాన్ ప్రాజెక్ట్‌ల రూపకల్పన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
'ఇస్రో.. అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై దిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలో కుమార్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
"ఇస్రోకు పెద్ద ఎత్తున శక్తి, సామర్థ్యాలు కావాలి. విస్తారమైన మన దేశానికి, అవసరాలకు, సమాచార వ్యవస్థకు, నౌకాయానానికి మనకు 100కు పైగా ఉపగ్రహాలు కావాలి. కానీ ప్రస్తుతం మనకు ఉన్నవి 55 మాత్రమే." - డా.కిరణ్ కుమార్, ఇస్రో మాజీ ఛైర్మన్
ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 327 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపిందని కుమార్ తెలిపారు. వాటిలో పీఎస్ఎల్వీ-సీ37 మిషన్ ద్వారా 2017 ఫిబ్రవరి 15న రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినట్లు ప్రస్తావించారు.
అలాంటి భారీ ఉపగ్రహాలను నెలల వ్యవధిలో అంతరిక్షానికి పంపాలంటే.. దేశంలోని గ్రామ పంచాయతీలు, రిమోట్ ప్రాంతాల్లోనూ బలమైన అంతర్జాల బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థ అవసరమని కుమార్ అన్నారు.
మన దేశీయ జీపీఎస్ వ్యవస్థ నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్).. గూగుల్ జీపీఎస్‌ను భర్తీ చేయగలదని కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మన నావిక్‌లో 7 ఉపగ్రహాలు ఉండగా... యూఎస్, చైనా వంటి దేశాలకు జీపీఎస్ కోసం 24-32 శాటిలైట్లు ఉన్నాయన్నారు.
ఈ ఏడు ఉపగ్రహాలను 2013 జులై నుంచి 2016 ఏప్రిల్ మధ్య అంతరిక్షానికి పంపారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక.. నావిక్ ఆలస్యానికి పలు కారణాలను వెల్లడించింది. సైట్లు సిద్ధంగా లేకపోవడం, సాంకేతిక అవసరాలు, అధికారిక కారణాలు, తరలింపులో ఆలస్యం వంటివి జాప్యానికి కారణాలుగా పేర్కొంది.
- ఇదీ చూడండి: 'పోలీసులే దుప్పట్లు ఎత్తుకెళ్లారు'