దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 16,311 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 4లక్షల 66వేల 595కు పెరిగింది. వైరస్ ధాటికి మరో 161మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 1లక్షా 51వేల 160కి చేరింది.
రికవరీ రేటు ఇలా..
తాజాగా 19వేల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 1కోటి 92వేల 909కి చేరింది. 2లక్షల 22వేల 526 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.43 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు 1.44 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 6లక్షల 59వేలకు పైగా నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 18కోట్ల 17లక్షలు దాటింది.