కశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చేసిన 'మధ్యవర్తిత్వం' ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. పాకిస్థాన్ అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయించడంపై దృష్టి సారించాలని స్పష్టం చేసింది.
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న గుటెరస్... కశ్మీర్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, పాక్‌ల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరించే విధంగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
గుటెరస్ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్... జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత దేశ అంతర్గత భాగమేనని స్పష్టం చేశారు.
"ఈ విషయం(కశ్మీర్)లో భారత వైఖరి మారదు. జమ్ముకశ్మీర్ ఇప్పుడు.. ఎప్పుడు భారత అంతర్భాగమే. పరిష్కరించాల్సిన సమస్య ఏదైనా ఉందంటే.. అది పాకిస్థాన్ అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయించడమే. ఇంకా ఏమైన సమస్యలు ఉంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. కశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించే అవసరం లేదు."
- రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ ప్రతినిధి.
పాక్‌లో నాలుగు రోజుల పర్యటన..
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నారు ఆంటోనియో గుటెరస్. ఇస్లామాబాద్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషీతో సమావేశమైన సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు గుటెరస్.
ఇదీ చూడండి: 'క్రూయిజ్‌షిప్'లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా