చైనా, పాకిస్థాన్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్ముకశ్మీర్‌ను ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పూర్తిగా భారత అంతర్గత విషయమని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
ఈ మేరకు తమ దేశ అంతర్గత విషయాల్లో సంబంధిత పక్షాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవా తేల్చిచెప్పారు.
"చైనా-పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల రెండో రౌండ్ చర్చల తర్వాత విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని గతంలో మాదిరిగానే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం."
-అనురాగ్ శ్రీవాస్తవా, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి
రెండో ద్వైవార్షిక వ్యూహాత్మక సమావేశంలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ కశ్మీర్ అంశంపై చర్చించారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) పురోగతిపైనా సమాలోచనలు జరిపారు.
ఈ మేరకు సీపెక్ అంశంపైనా శ్రీవాస్తవా స్పందించారు. సీపెక్‌పై భారత అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన భూభాగంలో ఈ ప్రాజెక్టు చేపట్టడాన్ని వ్యతిరేకించారు.
"సీపెక్‌పై భారత్‌కున్న ఆందోళన గురించి చైనా, పాకిస్థాన్‌లకు చాలాసార్లు వివరించాం. చట్టవిరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమించిన భారత భూభాగంలో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో యథాతథ స్థితిని మార్చేందుకు చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నాం. అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని పిలుపునిస్తున్నాం."
-అనురాగ్ శ్రీవాస్తవా, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి
జమ్ముకశ్మీర్‌లోని సమస్యలపై చైనా అధికారులకు వివరించినట్లు వాంగ్, ఖురేషీ మధ్య చర్చల తర్వాత పాక్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. ఈ సమస్యను ఐరాస చార్టర్ ప్రకారం పరిష్కరించుకోవాలని చైనా పేర్కొన్నట్లు సంయుక్త ప్రకటన వెల్లడించింది. భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలను అనుసరించి చర్చించుకోవాలని, సమస్యను జఠిలం చేసేందుకు ఏకపక్షంగా తీసుకునే చర్యలకు చైనా వ్యతిరేకమని ప్రకటన పేర్కొంది.
ఇదీ చదవండి: 'మహా'పై కరోనా పంజా- 22వేలకు చేరువలో మరణాలు