భారత్లో తొలి కరోనా మరణం సంభవించింది. కర్ణాటక కలబురిగికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల క్రితమే అతడు మృతి చెందినప్పటికీ పరీక్షలు నిర్వహించి నేడు అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం.
ఫిబ్రవరి 29న బాధితుడు దుబాయ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు అధికారులు. దుబాయ్ నుంచి వచ్చాక దగ్గు, జ్వరంతో బాధపడ్డాడు ఆ వృద్ధుడు. జిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. ప్రత్యేక వార్డులో చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపారు. తర్వాత తిరిగి కలబురిగి తీసుకెళ్లారు. అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు.
వృద్ధుడితో ఉన్న వారిని గుర్తించటం, వారికి పరీక్షలు నిర్వహించే అన్ని రకాల చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా బాధితుడి మృతిపై తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.
భారత్లో ఇది తొలి కరోనా మరణం కాగా.. ఇప్పటి వరకు 74 మందికి ఈ మహమ్మారి సోకింది.