దేశ ప్రజలే లక్ష్యంగా పాకిస్థాన్ కాల్పులకు తెగిస్తోందని భారత సైనికాధికారులు తెలిపారు. నియంత్రణరేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లుపొడుస్తున్న పాక్.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాక్ సైనిక కవ్వింపులు మరింత ఎక్కువైనట్లు స్పష్టం చేశారు.
పాక్, భారత సైన్యాధికారుల మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని గణాంకాలతో సహా ప్రస్తావించింది. అలాగే జమ్ముకశ్మీర్‌లో గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రదాడులు చాలా వరకు తగ్గినట్లు అధికారులు స్పష్టం చేశారు.
" కశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నందున ఉగ్రమూకలు ఆయుధాల సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తీవ్రవాదులందరికీ వేర్వేరు మార్గాల ద్వారా ఆయుధాలు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొందరు ఉగ్రవాదులు.. జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రత్యేక పోలీసు అధికారుల(ఎస్పీఓ)నుంచి తుపాకులను దోపిడీ చేస్తున్నారు."
- రణ్బీర్ సింగ్, ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్
కశ్మీర్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు
దాదాపు 500 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో చొరబడేందుకు యత్నిస్తున్నారని రణ్బీర్ సింగ్ తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో చొరబడే అవకాశం కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణరేఖ వద్ద శిక్షణ శిబిరాల్లో వీరంతా మాటు వేసుకుని కూర్చున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
" జమ్ముకశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు పాక్ సహకారంతో రెండు నుంచి మూడొందల మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు. శిబిరాల్లో ఉగ్రవాదులకిచ్చే శిక్షణ సమయాన్ని బట్టి ఈ సంఖ్య ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ముష్కరుల సంఖ్య ఎంత ఉన్నా.. వారిని అదుపు చేసే సత్తా భారత సైనికులకు ఉంది."
- రణ్బీర్ సింగ్, ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్
ఇదీ చూడండి : ఫోర్బ్స్: భారత అపరకుబేరుడు మళ్లీ ముకేశ్ అంబానీనే