జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటానికి ఒక సంఘటన కారణం కాదని, ఆయన పాల్గొన్న పలు ఉగ్రవాద కార్యకలాపాలు అందుకు దోహదం చేశాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
పుల్వామా ఘటన జరగక ముందు నుంచే అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ ప్రయత్నించిన సంగతి గుర్తుచేశారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్. దౌత్యపరంగా ఎదురైన పరాభవం నుంచి ప్రపంచం దృష్టి మరల్చేందుకు పాకిస్థాన్ పుల్వామా అంశాన్ని తెరపైకి తెస్తుందన్నారు.
"దేశ భద్రతకు సంబంధించి మేం ఏ దేశంతోనూ ఉగ్రవాదంపై సంప్రదింపులు జరపలేదు. భారత్ లక్ష్యం మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా చేయడమే.
ఈ ప్రక్రియ 2009లో ప్రారంభమైంది. 2016-17లో మరోసారి ప్రయత్నం చేశాం. ఓ ప్రత్యేక ఘటనకు సంబంధించి కాకుండా 1267 ఆంక్షల కమిటీ సభ్యులకు భారత్ సమర్పించిన ఆధారాల ప్రకారంగా అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. నిధులు సమకూర్చటం, పథక రచన, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించినందుకు మసూద్ అజార్ పేరు ఆంక్షల కమిటీ జాబితాలో చేర్చినట్లు ఐరాస నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు."
- రవీష్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ఇదీ చూడండి: 'ఓటుతో తప్పుడు హామీలిచ్చిన వారికి బుద్ధిచెప్పండి'