కరోనా సమయంలో ప్రపంచానికి భారత్ పరిష్కార వేదికగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగం, సరఫరా వ్యవస్థ, పీపీఈ సమస్యలను తరచుగా విన్నామని.. అయితే భారత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు.
ఇన్వెస్ట్ ఇండియా వార్షిక సమావేశంలో ప్రసంగించిన మోదీ.. ప్రపంచానికి భారత్ ఔషధ కర్మాగార పాత్ర పోషించిందన్నారు. దాదాపు 150 దేశాలకు ఔషధాలను సరఫరా చేశామని తెలిపారు. ఈ ఏడాది మార్చి-జూన్ మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23 శాతం పెరిగాయని స్పష్టం చేశారు. ఇదంతా కరోనా లాక్డౌన్ సమయంలో జరగటం విశేషమన్నారు.
"దేశంలో మా ప్రభుత్వం ఎన్నో సంస్కరణలకు తెరతీసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సరళీకరించాం. సంపద సృష్టి కోసం స్నేహపూర్వక పన్ను పాలనను అమల్లోకి తెచ్చాం. కంపెనీ చట్టంలోని వివిధ నేరాలను డీక్రిమినలైజ్ చేశాం. వ్యవసాయ, కార్మిక చట్టాల్లో సంస్కరణలు చేశాం. ఉద్యోగి, సంస్థలకు లాభం చేకూరేలా కార్మిక చట్టంలో సవరణలు చేశాం."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'ప్రధాని చెప్పినట్టు చేస్తే కరోనాపై విజయం'